కామాంధుల కళ్లుమూసుకుపోతున్నాయి. తమ కామవాంఛ తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. అభంశుభం తెలియని బాలికను, అమ్మాయిలను బలి చేస్తున్నారు. సొంత మనుషులు, బాగా తెలిసివారే బాలికలపై లైంగికదాడికి పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది.
బాలికపై కజిన్ తో పాటు పలువురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడు విల్లుపురం జిల్లా కన్నత్తూర్ లో జరిగింది. కజిన్ తో పాటు అతని స్నేహితులు 9 మంది బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక పాఠశాల యాజమాన్యానికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇటీవల పాఠశాలకు వెళ్లిన బాలిక ముభావంగా కనిపించడంతో టీచర్ ఏం జరిగిందని ఆరా తీయగా.. అసలు విషయం బయట పడింది. తన అంకుల్ కుమారుడు శశి, అతని స్నేహితులు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నారని వెల్లడించింది. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం డీఈఓకు తెలపగా.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం ముందియంబాక్కం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితులైన శశి, మనికందన్, వినాయక మూర్తిలను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు.