వాట్సాప్‌లో పెరుగుతున్న సైబర్ మోసాల గురించి ఎస్‌బీఐ తన ఖాతాదారులను హెచ్చరిస్తోంది. వాట్సాప్‌లో ఎవరైనా ఏదైనా బ్యాంక్ లింక్ అని చెప్పి పంపిస్తే వాటిని ఓపెన్ చేయవద్దని బ్యాంకు అధికారులు హెచ్చరిస్తున్నారు.
సోషల్ మీడియా పుణ్యమా అని మనకు అందులో అసలు ఏది అసలు వార్తో, ఏది నకిలీ వార్తో తెలియడం లేదు. దీంతో నకిలీ వార్తల బారిన పడి అనేక మంది అనేక రకాలుగా నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు కేటుగాళ్లు ఇదే విషయాన్ని ఆసరాగా చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుత తరుణంలో ఇలాంటి మోసాలు ఎక్కువైపోయాయి. ఫోన్ చేస్తారు.. ఓటీపీ చెప్పమంటారు.. లేదంటే మీకు ఫలానా లింక్ పంపిస్తున్నాం.. అందులో మీ బ్యాంకు వివరాలు షేర్ చేయమని చెబుతారు. దీంతో మనం నిజమే అని నమ్మి వారికి సమాచారం ఇస్తాం. ఇంకేముందీ.. నిమిషాల వ్యవధిలోనే మన బ్యాంక్ అకౌంట్లలో ఉండే డబ్బు మాయమవుతుంది. దీంతో మనం ఘొల్లుమని ఏడుస్తాం.
ఆన్‌లైన్ మోసాలు ఎక్కువై పోతున్న తరుణంలో బ్యాంకులన్నీ ఎప్పటికప్పుడు తమ ఖాతాదారులను వాటి పట్ల హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా మోసగాళ్లు నేరాలు చేసేందుకు, డబ్బు దోచుకునేందుకు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎస్‌బీఐ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని కొందరు మోసగాళ్లు వాట్సాప్‌లో రెచ్చిపోతున్నారు. పలు లింక్‌లను పంపిస్తూ బ్యాంకు అధికారులమని చెప్పి నమ్మించి ప్రజల బ్యాంకు సమాచారాన్ని, ఓటీపీ నంబర్లను తెలుసుకుంటున్నారు. అనంతరం పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి డబ్బు డ్రా చేసుకుంటున్నారు.
తాజాగా వాట్సాప్‌లో పెరుగుతున్న సైబర్ మోసాల గురించి ఎస్‌బీఐ తన ఖాతాదారులను హెచ్చరిస్తోంది. వాట్సాప్‌లో ఎవరైనా ఏదైనా బ్యాంక్ లింక్ అని చెప్పి పంపిస్తే వాటిని ఓపెన్ చేయవద్దని బ్యాంకు అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఓటీపీ చెప్పండంటూ చేసే ఫోన్ కాల్స్‌కు కూడా స్పందించవద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఏదైనా మోసం జరిగి డబ్బు పోయిందని ఎవరైనా భావిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించాలని, మూడు రోజుల్లోగా స్పందిస్తే పోయిన డబ్బును రికవరీ చేస్తామని ఎస్‌బీఐ చెబుతోంది. అయితే ఖాతాదారులు తమ ఇష్టపూర్వకంగా ఓటీపీ నంబర్లను చెప్పినా, బ్యాంకు సమాచారం ఇతరులతో షేర్ చేసుకున్నా.. పోయిన డబ్బు తిరిగిరాదని ఎస్‌బీఐ చెబుతోంది. కనుక.. వాట్సాప్ మాత్రమే కాదు, సోషల్ మీడియాలో మీకు వచ్చే ఏ లింక్‌నైనా నమ్మకండి. ముఖ్యంగా బ్యాంకుల పేరిట వచ్చే లింక్‌లను అస్సలు ఓపెన్ చేయకండి. లేదంటే.. అనవసరంగా డబ్బు నష్టపోవాల్సి వస్తుంది… కాబట్టి తస్మాత్ జాగ్రత్త..!