దేశవ్యాప్తంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులంతా ఈ తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలిచారు. విజయదశమిని పురస్కరించుకుని నవరాత్రి ఆఖరి రోజున దేశవ్యాప్తంగా దుర్గమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్‌లోని జల్పాయ్‌గురిలోని దుర్గమ్మ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది.
పశ్చిమబెంగాల్‌లోని జల్పాయ్‌గురిలో దసరా రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక మాల్ నదిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడంలో ఈ ప్రమాదం సంభవించింది. నదీప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో ప్రవాహం ధాటికి కొట్టుకుపోయి 8 మంది దుర్మరణం పాలయ్యారని పోలీసులు వెల్లడించారు. వ
రదలో పలువురు కొట్టుకుపోయారని పోలీసులు తెలిపారు. 50 మందిని రక్షించామని, గల్లంతైన వారికోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు వివరించారు. ఎనిమిది మంది మరణంతో పండుగ పూట వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.