ఈ-కామర్స్ సంస్థలు ఏవైనా సరే కస్టమర్ ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ రాకుండా ఆ బాక్స్ ఖాళీగా ఉంటే ఆ ప్రొడక్ట్ సొమ్మును రీఫండ్ చేస్తాయని అందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని కొందరు ప్రబుద్ధులు ఆసరాగా చేసుకున్నారు. దీంతో వారు ఒక గ్యాంగ్‌గా ఏర్పడి ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు కుచ్చు టోపీ పెట్టారు. ఏకంగా రూ.30 లక్షల సొమ్మును స్వాహా చేశారు. ఇంతకీ అసలు జరిగిన విషయం ఏమిటంటే…
మధ్యప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ మహువాలా (27) అనే వ్యక్తి నకిలీ ఈ-మెయిల్ ఐడీలు, మొబైల్ నంబర్లతో నకిలీ అమెజాన్ ఖాతాలను సృష్టించాడు. అనంతరం అందులో తన స్నేహితులతో కలిసి విలువైన ప్రొడక్ట్స్‌ను ఆర్డర్ చేసేవాడు. అయితే ప్రొడక్ట్ అతనికి డెలివరీ అయినప్పటికీ ఆ బాక్స్‌లో ప్రొడక్ట్స్ ఏవీ లేవని, ఖాళీగా ఉన్నాయని చెప్పి అమెజాన్‌కు ఫిర్యాదు చేసేవాడు. ఇది నిజమే అని నమ్మిన అమెజాన్ మహమ్మద్ మహువాలాకు ఆ ప్రొడక్ట్ సొమ్మును రీఫండ్ చేసేది. కానీ నిజానికి బాక్స్‌లోంచి ప్రొడక్ట్స్ తీసే మహువాలా వాటిని తక్కువ ధరకు స్థానికంగా ఉన్న స్టోర్స్‌లో అమ్మేవాడు. ఇలా తన స్నేహితులతో కలసి అతను కొంత కాలంగా అమెజాన్‌ను బురిడీ కొట్టిస్తున్నాడు.
అయితే అమెజాన్ ప్రతినిధులకు ఈ వ్యవహారంపై అనుమానం వచ్చింది. దీంతో వారు వెంటనే మధ్యప్రదేశ్ సైబర్ సెల్ ఎస్పీ జితేంద్ర సింగ్‌కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు ట్రేస్ చేసి నిందితులను పట్టుకున్నారు. వారు ఇప్పటి వరకు 50 గ్యాడ్జెట్లను ఇదే తరహాలో అమెజాన్‌లో ఆర్డర్ చేసి రూ.30 లక్షల సొమ్మును రీఫండ్ రూపంలో పొందినట్లు పోలీసులు నిర్దారించారు. దీంతో నిందితుల నుంచి రెండు ఖరీదైన బ్రాండెడ్ ఫోన్లు, ఒక వైర్‌లెస్ రూటర్, ఒక హెడ్‌ఫోన్, రెండు స్మార్ట్ వాచ్‌లు, ఒక క్రెడిట్ కార్డును స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా నిందితులకు స్థానికంగా ఉన్న అమెజాన్ వేర్ హౌస్‌లో ఎవరైనా అమెజాన్ సిబ్బంది సహకరించి ఉంటారా.. అన్న కోణంలోనూ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.