యూట్యూబ్ లో చూసి దొంగతనం ఎలా చేయాలో నేర్చుకుని.. జ్యువెలరీ షాపుకు కన్నం వేసిన దొంగ

-

కొన్ని సంఘటనలు చూస్తుంటే..జనాలు తెలివిమీరుతున్నారా లేక..అమాయకంగా తయారవుతున్నారా అర్థంకావటం లేదు. మొన్నటికిమొన్న ఒక అతను యూట్యూబ్ లో చూసి భార్యకు డెలివరీ చేశాడు..మరి ఇప్పుడు ఒకడు ఏకంగా యూట్యూబ్ లో చూసి దొంగతనం ఎలా చేయాలో తెలుసుకుని బంగారు షాప్ కి కన్నం వేశాడు. 15 కిలోల బంగారం దోచుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వెల్లూరులోని ఓ నగల దుకాణంలో వారంరోజుల క్రితం గోడకు కన్నం వేసి 15 కిలోల బంగారం దోచుకెళ్లిన విషయం తెలిసిందే! నిందితుడిని తమిళనాడు పోలీసులు అనతికాలంలోనే అరెస్ట్ చేశారు. ఐదు రోజుల పాటు ముమ్మర గాలింపులు చేసిన పోలీసులు నిందితుడి పట్టుకుని, అతని వద్ద బంగారు ఆభరణాలను స్వాదీనం చేసుకున్నారు. హైలెట్ ఏంటంటే.. యూట్యూబ్‌ వీడియోలు చూసి దోచుకోవడం ఎలాగో నేర్చుకుని పక్కాప్లాన్‌తో పనికానించాడీ ఈ ఘరానా దొంగ.

డిసెంబర్ 15న జోస్‌ ఆలుక్కాస్ జ్యువెలరీ షాపు గోడ పగులగొట్టి, లోపలున్న15 కిలోల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లారు. ఐతే సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తి సింహం ముసుగు ధరించి, స్ప్రే పెయింట్‌తో సీసీటీవీ కెమెరాల రికార్డింగ్‌ను ఆపేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. ఈ దోపిడీ ఘటనకు సంబంధించి పోలీసుల్లో మాత్రం అనేక అనుమానాలు తలెత్తాయి.

ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఎవరూ కనిపించకపోవడమే అందుకు కారణం. దాదాపు 200 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన 8 పోలీస్‌ టీమ్‌లు ఐదు రోజుల పాటు తీవ్రంగా గాలించి మొత్తానికి.. సోమవారం నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు కూచిపాళయం గ్రామానికి చెందిన టిఖారాం (22)గా గుర్తించారు.

యూట్యూబ్‌లో వీడియోలు చూసి దోపిడీకి స్కెచ్ వేశాడని..జ్యువెలరీ షాపు గోడకు రంధ్రం చేసి, శబ్దం రాకుండా షాపులోకి ప్రవేశించేందుకు10 రోజులపాటు ప్రాక్టీస్‌చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే సీసీటీవీని ఎలా బ్లాక్ చేయాలో కూడా యూట్యూబ్‌లోనే నేర్చుకున్నాడట.. వీలైనంత త్వరగా సంపన్నుడు కావాలని ఇలా చేశాడట నిందితుడు. అనూహ్యంగా పోలీసుల వలలో చిక్కుకోవడంతో మనోడి ప్లాన్ ప్లాప్ అయింది. అతని వద్ద నుంచి దాదాపు రూ.10 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. ఐపీసీ 457, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news