ప్రణయ్ హత్య కేసు.. కుమార్తె అమృత‌కు ఆస్తిలో చిల్లి గ‌వ్వ ఇవ్వ‌న‌న్న మారుతీ రావు..

4521

ప్ర‌ణయ్ హ‌త్య కేసును లోతుగా ద‌ర్యాప్తు చేసిన పోలీసులు ఆ కేసులో 1600 పేజీల‌తో కూడిన చార్జిషీట్‌ను బుధ‌వారం దాఖ‌లు చేశారు. కేసులో భాగంగా 9 నెల‌ల పాటు ద‌ర్యాప్తు జ‌రిపారు. అలాగే 120 మందిని విచారించారు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గత సెప్టెంబరు 14న జరిగిన ప్రణయ్‌ హత్య సంఘ‌ట‌న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం విదిత‌మే. త‌న కుమార్తె అమృత కులాంత‌ర వివాహం చేసుకుని త‌న ప‌రువు తీసింద‌నే కార‌ణంతో ఆమె తండ్రి మారుతీరావు అమృత భ‌ర్త ప్ర‌ణ‌య్‌ను కిరాయి రౌడీల‌తో హత్య చేయించాడు. దీంతో అప్ప‌ట్లో ఆ ఘ‌ట‌న రాష్ట్రంలో తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. సామాజిక కార్య‌క‌ర్త‌లు, స్వచ్ఛంద సంస్థ‌లు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేప‌ట్టారు. మారుతీరావును క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు.

అయితే ప్ర‌ణయ్ హ‌త్య కేసును లోతుగా ద‌ర్యాప్తు చేసిన పోలీసులు ఆ కేసులో 1600 పేజీల‌తో కూడిన చార్జిషీట్‌ను బుధ‌వారం దాఖ‌లు చేశారు. కేసులో భాగంగా 9 నెల‌ల పాటు ద‌ర్యాప్తు జ‌రిపారు. అలాగే 120 మందిని విచారించారు. ఈ క్ర‌మంలోనే చార్జిషీట్‌లో ఉన్న వివ‌రాల ప్ర‌కారం.. మారుతీరావు త‌న కుమార్తె అమృత‌కు త‌న ఆస్తిలో చిల్లిగ‌వ్వ కూడా ఇవ్వ‌కూడ‌ద‌ని వీలునామాలో రాయించాడ‌ని తెలుస్తోంది. అలాగే ప్ర‌ణ‌య్‌ను హత్య చేయించేందుకు మారుతీరావు ప‌క్కా ప్లాన్ వేశాడని కూడా చార్జిషీట్ ప్ర‌కారం మ‌న‌కు తెలుస్తోంది.

కుమార్తె అమృత అంటే వ‌ల్ల‌మాలిన ప్రేమ ఉన్న మారుతీరావు ఆమె కులాంత‌ర వివావం చేసుకోవడాన్ని త‌ట్టుకోలేక‌పోయాడు. ఇక ఆమె త‌న రిసెప్ష‌న్ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో త‌న ప‌రువు పోయింద‌ని భావించిన మారుతీరావు ఎలాగైనా ప్ర‌ణ‌య్‌ను హత్య చేసి అమృత‌పై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని అనుకున్నాడు. అందులో భాగంగానే ప్ర‌ణ‌య్ హ‌త్య‌కు ప‌క్కా స్కెచ్ వేశాడు. త‌న స్నేహితుడు క‌రీం స‌హాయంతో న‌ల్ల‌గొండ‌లో ఉన్న మాజీ ఐఎస్ఐ తీవ్ర‌వాదులు బారీ, అస్గ‌ర్ అలీల‌ను మారుతీరావు సంప్ర‌దించాడు.

కాగా అస్గ‌ర్ త‌న‌కు రాజ‌మండ్రిలో క‌ల‌సిన బీహార్ వాసి సుభాష్ శ‌ర్మ గురించి చెప్పాడు. దీంతో శ‌ర్మ బీహార్ నుంచి వ‌చ్చాడు. అత‌నికి మారుతీ రావు రూ.15 ల‌క్ష‌లు ఇచ్చాడు. అనంతరం మిర్యాల‌గూడ‌లోని క‌రీం ఇంట్లోనే శ‌ర్మ 45 రోజుల పాటు మ‌కాం వేసి.. ప‌క్కాగా రెక్కీ నిర్వ‌హించారు. ఆ త‌రువాత ప్ర‌ణ‌య్‌ను ప‌థ‌కం ప్ర‌కారం హ‌త్య చేశారు. అయితే ప్ర‌ణ‌య్ హ‌త్య కేసులో మారుతీరావుకు ఉరిశిక్ష విధించాల‌ని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్న‌ట్లు తెలిసింది. మొత్తం 8 మందికి ఈ హ‌త్య‌తో సంబంధం ఉంద‌ని పోలీసులు నిర్దారించారు. కాగా అమృత‌కు త‌న ఆస్తిలో చిల్లిగ‌వ్వ కూడా ఇవ్వొద్ద‌ని మారుతీరావు వీలునామా రాయించిన వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ అవుతోంది..!

READ ALSO  ప్రణయ్ మళ్లీ పుట్టాడు...పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అమృత