కేరళలోని కొండంగల్లూర్ పట్టణ మున్సిపల్ కార్పొరేషన్‌లో తొలుత ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అక్కడ ప్రతి ఇంట్లో కనీసం 2 మొక్కలను అయినా నాటాలని అధికారులు నిర్ణయించారు.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాతావరణ మార్పుల వల్ల ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఏటా భూ తాపం పెరిగిపోతోంది. దీంతో వేసవిలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. జనం ఎండ వేడికి తట్టుకోలేక పిట్టల్లా రాలుతున్నారు. అటు మూగజీవాలు కూడా మృత్యువాత పడుతున్నాయి. అయితే వాతావరణంలో జరుగుతున్న ఈ అనూహ్య మార్పులను తగ్గించుకోవాలంటే.. మనం చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో ఒకటి.. మొక్కలను పెంచడం..
మొక్కలను ఎక్కువగా పెంచి వాటిని సంరక్షించి చెట్లుగా చేస్తేనే.. పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. దీంతో సకాలంలో వర్షాలు కురవడమే కాదు, భూతాపం తగ్గుతుంది. కాలుష్యం ఉండదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉంటాయి. అయితే సరిగ్గా ఇదే విషయాన్ని గుర్తించిన కేరళ ప్రభుత్వం అక్కడి జనాల్లో పర్యావరణ సంరక్షణ పట్ల చైతన్యం పెరగడం కోసం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇకపై కేరళలో ఎవరైనా సరే.. ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మొక్కలను పెంచాల్సిందే.
కేరళలోని కొండంగల్లూర్ పట్టణ మున్సిపల్ కార్పొరేషన్‌లో తొలుత ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అక్కడ ప్రతి ఇంట్లో కనీసం 2 మొక్కలను అయినా నాటాలని అధికారులు నిర్ణయించారు. దీంతో అక్కడ ఎవరైనా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఇకపై మొక్కలను నాటాల్సి ఉంటుంది. అది కూడా అల్లాటప్పా మొక్కలు కాదు. మామిడి లేదా పనస మొక్కలను రెండేసి చొప్పున నాటాలి. వాటిని పెంచాలి. ఆ విధంగా సాక్ష్యాలు చూపించాలి. అప్పుడే ఇంటి రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
ఇక నూతనంగా ఇండ్లను నిర్మించేవారు ఇంటి పనులు ప్రారంభం అయినప్పటి నుంచే మొక్కలను నాటి పెంచాలి. అప్పుడే రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే చిన్న స్థలంలో ఇల్లు నిర్మించుకునేవారికి ఈ రూల్ వర్తించదు. కనీసం 1500 చదరపు అడుగులు.. ఆ పైన విస్తీర్ణం ఉన్న ఇండ్లకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. ఏది ఏమైనా.. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపడితే తప్ప పర్యావరణం మనుగడ కష్టమే. ఈ ఆలోచన చేసినందుకు కేరళ అధికారులను మనం అభినందించాల్సిందే..!