దొంగతనాలు అన్నది చాలా కామన్.. 64 కళల్లో చోర కళ కూడా ఉందని కొందరు దొంగలు ఘనంగా చెప్పుకుంటారు. ఎంతమంది ఉన్నా.. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా తమ హస్త లాఘవం చాటుకుంటూ ఉంటారు. ఇక దొంగల్లోనూ చాలా మంది విచిత్రైన దొంగలు ఉంటారు. వీరిలో కొందకు కేవలం కొన్ని వస్తువులనే దొంగిలిస్తారు.
ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఇప్పుడు దేశంలో కొత్త తరహా దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగల కన్ను ఇప్పుడు బంగారం, వాహనాలు, ఇతర విలువైన వస్తువులపై కంటే.. ఓ వస్తువుపై బాగా పడింది. అదేంటో తెలుసా.. ఉల్లిపాయలు.. అవును ఇప్పుడు దేశంలో ఉల్లిపాయల దొంగలు పెరిగారు.
ఉల్లిధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్న సమయంలో ఇప్పుడు దేశంలో ఉల్లి దొంగలు పుట్టుకొస్తున్నారు. అసలే పంట తక్కువై డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఉల్లిపాయలకు డిమాండ్ అమాంతం పెరిగింది. అందుకే దొంగలు కూడా ఇప్పుడు ఉల్లి నిల్వలపై కన్నేశారు. నమ్మడం లేదా.. అయితే కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తాం.. తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో 8 లక్షల రూపాయల విలువైన ఉల్లిగడ్డలను దొంగతనం చేశారు.
గోదాములో దాచిన సరుకు ఉన్నపళంగా మాయమైందని సదరు వ్యాపారి గగ్గోలు పెడుతున్నాడు. పోలీసులకు కంప్లయింట్ చేశాడు. మరో ఉదంతంలో మహారాష్ట్ర నాసిక్ లోని ఓ దుకాణంలో లక్ష రూపాయల విలువైన ఉల్లిగడ్డలు మాయం అయ్యాయి. ఇప్పుడు పోలీసులకు ఇలా ఉల్లి దొంగలు సవాల్ గా మారారు. ఉన్న దొంగతనాల కేసులకు తోడు ఇప్పుడీ ఉల్లి గోల ఏంట్రాబాబూ.. అని ఖాకీలు తలలు పట్టుకుంటున్నారు.