ఎరుపు రంగులో ప‌డుతున్న వ‌ర్షం.. ఎక్క‌డో తెలుసా..?

ఎరుపు రంగులో వ‌ర్షం. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. వాన ఎరుపు రంగులో ఉంటుంది. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. ఇదే నిజం. కూడ‌లూరులో ఎరుపు రంగులో వర్షం ప‌డుతుండ‌డంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. వివ‌రాల్లోకి వెళ్తే.. నీలగిరి జిల్లా, కూడలూరు సమీపంలో నాడుకాని గ్రామం ఉంది. దీని సరిహద్దు ప్రాంతాలైన నాడుకాని, ముండా, కూవత్తిపొళిల్‌లలో సోమవారం రాత్రి గంటకు పైగా వర్షం కురిసింది.

ఈ క్ర‌మంలోనే వ‌ర్షం ఎరుపు రంగులో ప‌డుతుండ‌డంతో స్థానికులు ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ నీటిని కొంద‌రు పాత్రల్లో, బాటిల్స్‌లో సేకరించారు. అయితే ఈ నీటిలో తడిసిన చాలా మందికి ఒంటిపై దురదలు ఏర్పడ్డాయి. ఈ విష‌యం తెలుసుకున్న ప‌రిస‌ర గ్రామాల ప్ర‌జ‌లు అక్క‌డ‌కు వ‌చ్చి స్థానికులు సేకరించిన నీటిని వింతగా తిలకించారు. ఇక రెవెన్యూశాఖ అధికారులు సేక‌రించిన నీటిని ప‌రిశోధ‌న‌ల‌కు తీసుకెళ్లారు.