ప్రేమికులనే ముద్రతో ఆత్మహత్యాయత్నం.. నిన్న యువకుడు మరణం.. ఇవాళ బాలిక మృతి

స్నేహితులుగా.. అన్నాచెల్లెల్లుగా ఉంటున్న తమపై ప్రేమికులనే ముద్ర వేశారని మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో నిన్న యువకుడు మరణించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఇవాళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు ఆత్మహత్యకు పాల్పడటానికి ప్రేరేపించిన వారి గురించి ఆరా తీస్తున్నారు. అసలేం జరిగిందంటే..

నందిపేట్‌కు చెందిన యువకుడు(22) నిజామాబాద్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) నిజామాబాద్‌లో పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం చదువుతోంది. వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. తామిద్దరం అన్నాచెల్లెలుగా ఉంటుంటే అందరూ ప్రేమికులుగా ప్రచారం చేశారని లేఖ రాసి.. ఈనెల 8న రాత్రి 8 గంటలకు జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ డిగ్రీ కళాశాల సమీపానికి చేరుకొన్నారు.

గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చికిత్స పొందుతూ యువకుడు బుధవారం ఉదయం మృతి చెందాడు. బాలిక ఇవాళ మరణించింది.