ఓ మహిళ మొదటి భర్తను హత్య చేసేందుకు రెండో భర్త ప్లాన్ చేశాడు. పక్కా ప్లాన్ తో తన స్నేహితులతో కలిసి అతణ్ని హత్య చేసేందుకు ప్రయత్నించగా అతడి కేకలు విన్న స్థానికులు వారిని చుట్టుముట్టడంతో చివరకు దొరికిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని కడూరు గ్రామంలో చోటుచేసుకుంది.
ఉపాధి కోసం రాజస్థాన్ నుంచి కడూరుకు వచ్చి ఉంటున్న మంజుళ అనే యువతిని మోహన్ రామ్ అనే వ్యక్తి ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం ఆ ఇద్దరూ కడూరులోనే ఉంటున్నారు. వివాహమైన రెండు నెలల అనంతరం ఆ దంపతులు రాజస్థాన్‌కు వెళ్లారు. మంజుళ మళ్లీ వెనక్కు తిరిగి రాలేదు. తర్వాత వస్తుందన్న నమ్మకంతో ఉపాధి కోసం మోహన్ రామ్ కడూరు చేరుకున్నాడు. తన ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో ఆమెను తీసుకు వచ్చేందుకు రాజస్థాన్‌కు వెళ్లగా అక్కడ తన భార్య హరియాణాలోని పిప్లివాలా గ్రామానికి చెందిన ఓం ప్రకాశ్ అనే యువకుడ్ని వివాహం చేసుకుని బెంగళూరులో ఉంటున్నట్లు తెలుసుకుని కంగుతిన్నాడు. తన నుంచి విడాకులు తీసుకోకుండా.. చేసుకున్న రెండో వివాహం చెల్లదంటూ భార్యకు చరవాణిలో సందేశాన్ని పంపించాడు. ఆమెకు ఫోన్ చేసినా, సందేశాలు పంపించినా నిన్ను అంతం చేస్తానని మోహన్ రామ్‌ను ఓం ప్రకాశ్ హెచ్చరించాడు.
పట్టు వీడకుండా ఆమెకు సందేశాలు పంపిస్తుండడంతో ఓం ప్రకాశ్ తన స్నేహితులను వెంటపెట్టుకుని కారులో కడూరుకు వచ్చాడు. నిత్యావసరాలను కొనుగోలు చేసుకుంటున్న మోహన్ రామ్‌ను వెంబడించి అపహరించాడు. కారులోనే కత్తితో హత్య చేసేందుకు ప్రయత్నించాడు. బాధితుడి కేకలు విన్న స్థానికులు చుట్టుముట్టడంతో కారు వేగం పెంచారు. కొంతదూరం వెళ్లే సరికి కారు ముందుకు కదలకుండా మొరాయించడంతో వారంతా దొరికిపోయారు. సమాచారం అందుకుని అక్కడకు వచ్చిన పోలీసులు ఓం ప్రకాశ్, శైలేంద్ర, ప్రదీప్, దల్లారామ్, జితేంద్ర, శంకర్ పాటిల్, దినేశ్ అనే నిందితులను అరెస్టు చేశారు. కారును, హత్య చేసేందుకు తమతో తెచ్చుకున్న వికెట్లను స్వాధీనపరుచుకుని దర్యాప్తు చేపట్టారు.