నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం సమీపంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు గండి పడింది. కాల్వలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో పాటు మట్టికట్ట బలహీనం కావడంతో ఈ గండి పడినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో కాల్వలోకి 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అటుగా వచ్చిన రైతులు గండి పడడం చూసి ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు జలాశయ అధికారులకు సమాచారం ఇవ్వడంతో నీటి విడుదలను ఆపేశారు.
ఒక్కసారిగా కాల్వ నీరంతా ఉద్ధృతంగా పక్కనే పంట పొలాల్లోకి చేరడంతో పొలాలు చెరువులను తలపించాయి. ఎన్నెస్పీ డీఈఈ సంపత్ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించి సాయంత్రం 6.15 గంటలకు ఎడమ కాల్వకు నీటి విడుదల నిలిపివేయించారు. కాల్వపై హాలియాలో ఉన్న గేట్లతో పాటు పెద్దదేవులపల్లి చెరువు నుంచి నీరు వెనక్కి రాకుండా అక్కడి గేట్లను కూడా మూసివేయించినట్లు డీఈఈ పేర్కొన్నారు.
వరద నీరు జాతీయ రహదారి పైకి రావడంతో మిర్యాలగూడ దేవరకొండ వెళ్లే మార్గాలను పోలీసులు దారిమళ్లించారు. రహదారి నిడమనూరు మండల కేంద్రంలో ఉన్న ఎస్బీఐ బ్యాంకు, దాని పక్కనే ఉన్న గిరిజన బాలికల మినీ గురుకులంలోకి నీరు చేరడంతో ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుని అక్కడ ఉన్న విద్యార్థులను స్థానికంగా ఉన్న ఫంక్షన్ హాల్లోకి తరలించారు.