పల్లె, బస్తీ దవాఖానాల్లో నాణ్యమైన వైద్యం అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మెరుగైన వైద్య సేవలు 24 గంటలు అందేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పల్లె, బస్తీ దవాఖానాల్లో 1,569 వైద్య పోస్టులను మంజూరు చేసింది. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ) పేరిట ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులు నింపనున్నారు.
ఇందులో బస్తీ దవాఖానాల్లో 349, పల్లె దవాఖానాల్లో 1,220 కలిపి 1569 పోస్టుల భర్తీకి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈనెల 17 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించారు. అర్హుల జాబితాను 29న వెల్లడించి, అభ్యంతరాలుంటే 30న స్వీకరిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన తుది అర్హుల జాబితాను అక్టోబరు 3న ప్రదర్శిస్తారు.
ఎంబీబీఎస్ అర్హత కలిగినవారికి ప్రాధాన్యం ఉంటుంది. పల్లె దవాఖానాల్లో ఈ పోస్టులో పనిచేయడానికి ఎంబీబీఎస్/బీఏఎంస్ వైద్యులు రాకుంటే.. 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించిన బీఎస్సీ నర్సింగ్ పట్టభద్రులు లేదా 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్/జీఎన్‌ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్ ప్రోగ్రాం పూర్తిచేసిన వారిని తీసుకుంటారు.