భారత్, అమెరికాల మధ్య ఈరోజు ఒక కీలకమైన రక్షణ రంగ ఒప్పందం కుదరనుంది. అమెరికా నుంచి అత్యాధునిక మిలటరీ టెక్నాలజీ బదిలీ సహా ఇరు దేశాల సరఫరా వ్యవస్థ, భూ భౌగోళిక ఇమేజ్ ల వినియోగానికి సంబంధించిన ఒప్పందమని తెలుస్తోంది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్ టీ ఎస్పర్ మధ్య నిన్న జరిగిన చర్చల సందర్భంగా దీనిపై ఒక అంగీకారం కుదిరినట్లు సమాచారం.
ఇరుదేశాల మధ్య రక్షణ సహా వ్యూహాత్మక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, రెండు దేశాల మధ్య సైన్యాల మధ్య సహకారం పెంపొందించుకోవడంపై మంత్రులు చర్చలు జరిపారు. చైనాతో సరిహద్దు వివాదం అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చిందని అంటున్నారు. ఇరుదేశాల మధ్య బీఈసీఏ ఒప్పందం కుదరడంపై రాజ్‌నాథ్, ఎస్పర్ లు సంతృప్తి వ్యక్తం చేశారు.