కరోనా వైరస్‌పై చేస్తున్న పోరాటంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సైంటిస్టులు ఆ వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో పడ్డారు. ఇక భారతీయ సైంటిస్టులు కూడా పలు రకాలుగా ఆ వైరస్‌కు అడ్డుకట్ట వేయగలిగే వ్యాక్సిన్‌ను తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో భాగంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) లెప్రసీ (కుష్టు) వ్యాధికి ఇచ్చే ఓ మల్టీ పర్పోస్ వ్యాక్సిన్‌ను కరోనా వైరస్‌పై ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ మాండె వివరాలను వెల్లడించారు.
కాగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి తమకు కావల్సిన అనుమతుల్లో పలు అనుమతులు అందాయని.. మిగిలిన అనుమతులు అందితే మరో 6 వారాల్లో లెప్రసీ వ్యాక్సిన్‌ను కరోనాపై ప్రయోగించి ఫలితాలు తెలుసుకోవచ్చని అన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సైంటిస్టులు ఇప్పటికే కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రయోగాల్లో నిమగ్నమవ్వగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతున్న ప్రకారం.. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేందుకు మరో 8 నుంచి 12 నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కొత్తగా వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు అంత సమయం పడుతుంది కానీ.. ఇప్పటికే ఉన్న పలు ఇతర వ్యాక్సిన్లను కరోనా వైరస్‌పై ప్రయోగించి.. అవి సక్సెస్ అయితే.. మనుషులకు వ్యాక్సిన్ ఇవ్వడం తేలిక అవుతుంది. అందువల్లే తాము ఆ మల్టీ పర్పోస్ వ్యాక్సిన్‌ను కరోనాపై ప్రయోగించాలనుకుంటున్నామని డాక్టర్ శేఖర్ మాండె తెలిపారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 21 లక్షలకు పైగా చేరుకోగా… మన దేశంలో మొత్తం 13వేల మందికి పైగా కరోనా సోకింది. 437 మంది చనిపోయారు.