పచ్చని పైర్లతో కళకళలాడుతూ ప్రశాంతతకు నిలయంగా ఉండే కోనసీమ రణరంగంగా మారింది. కోనసీమ జిల్లా పేరు మార్పుపై జేఏసీ చేపట్టిన ఆందోళన అదుపుతప్పి విధ్వాంసానికి దారి తీసింది. అమలాపురం దాదాపు 5 గంటల పాటు అట్టుడికింది. అదనపు బలగాలను మోహరించిన పోలీసులు… అర్ధరాత్రి తర్వాత అతికష్టం మీద పరిస్థితిని కొంత అదుపులోనికి తెచ్చారు. అల్లర్లు, విధ్వంస ఘటనలతో కరెంట్ కట్ చేయడంతో అమలాపురం అంధకారంలో ఉంది. రాత్రంతా ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. నిన్నటితో పోల్చితే పరిస్థితి శాంతించినట్లు కనిపించినా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన కోనసీమ వాసుల్లో కనిపిస్తోంది. రాత్రి అమలాపురం సహా కోనసీమ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో జనాలకు ఇళ్ల నుంచి బయటికి రాలేకపోయారు. ఇది కూడా ఉద్రిక్తతను తగ్గించడంలో పోలీసులకు కలిసివచ్చింది.
కోనసీమలో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గేవరకు కర్ఫ్యూ ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఇతర ప్రాంతాల నుంచి కోనసీమకు భారీగా బలగాలను మోహరించారు. దీంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. కోనసీమలో తీవ్ర ఉద్రిక్తలు కొనసాగుతుండగానే కోనసీమ సాధన సమతి మరో నిరసనకు పిలుపిచ్చింది. బుధవారం ఉదయం 10 గంటలకు నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించింది. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ సమీపంలోని నల్లవంతన వద్దెకు ప్రజలు రావాలని పిలుపిచ్చింది. అంబేద్కర్ పేరు వద్దంటూ జరుగుతున్న ఆందోళనలపై దళిత సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.
అంబేద్కర్ పేరును తొలగించాలని ఆందోళనలు చేయడం దారుణమంటున్న దళిత సంఘాలు.. కోనసీమ సాధన సమితిపై భగ్గుమంటున్నారు. పోటీ నిరసనలకు ప్లాన్ చేస్తున్నాయి. మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడిని దళిత సంఘాల నేతలు ఖండించారు. అంబేద్కర్ పేరు మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో పోటాపోటీ నిరసనలు ఎటు దారి తీస్తాయోనన్న కలవరం పోలీస్ వర్గాల్లో ఉంది. కర్ఫూ ఉన్నందున ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు.రోడ్ల మీదకు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పారు.