రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నిన్నటి వరకు కత్తులు నూరుకున్న నాయకులు కలిసి తిరిగినా.. నిన్నటి వరకు కలిసి తిరిగిన వారు నేడు కత్తులు నూరుకున్నా.. ఆశ్చర్యపోవాల్సిన అవస రం లేదు. అచ్చు ఇలానే ఉంది.. ఏపీ రాజకీయం. ఏపీలో చంద్రబాబును తీవ్రంగా విమర్శించిన నాయకు లు కూడా ఇప్పుడు ఆయనను సమర్ధించే పనిని పెట్టుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఫ్యామిలీకే చెందిన కీలక నాయకురాలు.. అన్నగారి కుమార్తె పురందేశ్వరి ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్న విషయం తెలిసిం దే. పార్టీ ఏది అధికారంలో ఉంటే.. దానికి వంత పాడడం ఈమెకు రాజకీయంగా అబ్బిన విద్య.
వైఎస్ హయాంలో ఆయన ఆశీస్సులతో కాంగ్రెస్ తీర్తం పుచ్చుకున్న పురందేశ్వరి, కేంద్రంలో మంత్రిగానూ చక్రం తిప్పారు. అయితే, తర్వాత రాష్ట్ర విభజనతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీ తీర్థం పుచ్చుకుని రెండు సార్లు పోటీ చేసి రెండు సార్లూ ఓటమిపాలయ్యారు. ఇక, చంద్రబాబును కొన్నాళ్లుటార్గెట్ చేసిన ఆమె తాజాగా .. ఆయనను వెనుకేసుకు వస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా అయినా.. మరిది గారిని ఆమె సమర్ధించేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాలన ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందన్నారు. పాలన చేపట్టిన మూడు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర అనిశ్చితి నెలకొందన్నారు.
వైసీపీ ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందిస్తుందనే ఆశలు ప్రజల్లో లేవు అని పురందేశ్వరి అన్నా రు. కడపలో శుక్రవారం జరిగిన బీజేపీ వర్క్ షాపునకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అవినీతి జరిగిందంటూ ప్రస్తుత ప్రభుత్వం ప్రతిదీ రద్దు చేయడమే పనిగా పెట్టుకోవడం సరైంది కాదన్నారు. పెట్టుబడులు పెట్టడానికి పారశ్రామికవేత్తలు రాని పరిస్థితిని తీసుకురావడం మంచిది కాదన్నారు. ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రాభివృద్ధిని చేజేతులా నాశనం చేయడమే అవుతుందన్నారు.
రాజధాని అమరావతిపై మంత్రులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్న తీరు బాలేదన్నారు. భూములిచ్చిన రైతులు, ప్రజలు అయోమయానికి గురవుతున్నారన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. మొత్తానికి ఈ వ్యాఖ్యలు మరిది గారిని సమర్ధించడం తప్ప మరేంటనేది ఇప్పుడు సోషల్ మీడియా అడుగుతున్న ప్రధాన ప్రశ్నం. కేంద్రంలో బీజేపీ-టీడీపీ చెలిమికి సంబంధించిన ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో ఇలా వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది.