పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టితో తయారు చేసిన వినాయకుల విగ్రహాలను వాడాలనే విషయం అందరికీ తెలిసిందే. మీ ఇంట్లోనే మీరు కూడా మట్టితో ఎంచక్కా వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసుకోవచ్చు.
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టితో తయారు చేసిన వినాయకుల విగ్రహాలను వాడాలనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మట్టి విగ్రహాలను చాలా వరకు ఎక్కడ చూసినా ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు. కానీ ఆ విగ్రహాలను కూడా పొందలేని వారు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కింద తెలిపిన విధంగా సూచనలు పాటిస్తే మీ ఇంట్లోనే మీరు కూడా మట్టితో ఎంచక్కా వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసుకోవచ్చు. మరి ఆ విగ్రహాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
మట్టి వినాయకుడి విగ్రహం తయారీకి కావల్సిన పదార్థాలు:
మట్టి, నీరు, రంగుల కోసం పసుపు, కుంకుమ, తులసి విత్తనాలు
వినాయకుడి మట్టి విగ్రహాన్ని ఇలా తయారు చేయండి…
1. మట్టిని, నీటిని తగినంత తీసుకుని కలిపి ముద్దగా విగ్రహం తయారీకి అనువుగా ఉండేలా కలుపుకోవాలి.
2. మట్టి ముద్దతో 3 పెద్ద సైజ్ ముద్దలను, 4 పొడవైన ముద్దలను, మరో 4 చిన్నసైజ్ ముద్దలను తయారు చేసుకోవాలి. 3 పెద్ద సైజ్ ముద్ధలతో బేస్, బాడీ, తలను తయారు చేయాలి. 4 పొడవైన ముద్దలతో కాళ్లు, చేతులు, మరో 4 చిన్నసైజ్ ముద్దలతో తొండం, చెవులను తయారు చేసుకోవాలి.
3. ముట్టి ముద్దను పెద్దగా కలుపుకుంటే విగ్రహాన్ని కూడా పెద్దగా తయారు చేసుకోవచ్చు.
4. వినాయకుడి కళ్లకు బదులుగా తులసి విత్తనాలను ఆ స్థానంలో పెట్టుకోవచ్చు.
5. పసుపు, కుంకుమ లేదా ఇతర సహజసిద్ధమైన రంగులను అవసరం అనుకుంటే వినాయకుడికి అలంకరణ కోసం ఉపయోగించవచ్చు.
అయితే వినాయకుడి విగ్రహం కళాకారులు తీర్చిదిద్దినట్లుగా చక్కని ఆకృతిలో రాలేదని దిగులు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన ఆకారం వచ్చేట్టుగా ఒక మోస్తరుగా విగ్రహాన్ని తయారు చేసుకున్నా చాలు.. ఆయన విగ్రహాన్ని నిరభ్యంతరంగా పూజించుకోవచ్చు. ఇక కచ్చితంగా చక్కని ఆకృతిలో వినాయకుడి విగ్రహం రావాల్సిందే.. అనుకుంటే.. కొంచెం ఎక్కువ శ్రమ పెట్టాల్సి ఉంటుంది. టైముంది అనుకుంటే.. చాలా ఎక్కువ సేపు ఓపిగ్గా ఉండి అయినా సరే.. వినాయకుడి విగ్రహాన్ని మనమే చక్కగా మట్టితో తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకాలస్యం.. మట్టితో విగ్రహాన్ని తయారు చేయడం మొదలు పెట్టండిక..!