జ‌గ‌న్ అల్టిమేటం… వైసీపీకి ద‌గ్గుబాటి గుడ్ బై..!

-

ప్రకాశం జిల్లా పర్చూరు రాజకీయాల్లో త్వరలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. రెండు పార్టీల్లో ఉన్న దగ్గుబాటి దంపతులు డబుల్ గేమ్ ఆడుతున్నట్టు వైసిపి వర్గాల్లో కొద్దిరోజులుగా అనుమానాలు రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు చెంచురామయ్య వైసీపీలో ఉండగా, దగ్గుబాటి భార్య పురందేశ్వరి మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లోనూ భార్యభర్తలిద్దరు రెండు పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బిజెపి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ గా చేస్తూ వస్తోంది.

పురందేశ్వరి సైతం జగన్ తో పాటు వైసీపీ ప్రభుత్వం పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.
పురందేశ్వరి వైసీపీని టార్గెట్ చేయటం నచ్చని ఆ పార్టీ నేతలు దగ్గుబాటికి అదిరిపోయే షాక్ ఇచ్చారు. గత ఎన్నికలకు ముందు వరకు పర్చూరు వైసిపి ఇన్చార్జిగా ఉన్న రావి రామనాథం బాబుని దగ్గుబాటి చెప్పకుండానే తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ లోకి వెళ్లి ప్రచారం చేసిన రామనాథం బాబుని తిరిగి పార్టీలో చేర్చుకోవడం ద్వారా దగ్గుబాటికి చెక్ పెట్టినట్లే అని తెలుస్తోంది.

అయితే ఇప్పటి వరకు ఓటమి అంటే ఏమిటో తెలియని దగ్గుబాటి తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో వైసిపి ప్రభంజనం సృష్టించిన ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోవడంతో అప్పటి నుంచి దగ్గుబాటికి పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. దగ్గుబాటి వల్ల పార్టీలో కీలక నేతలు సైతం ఇబ్బంది పడుతున్నారు అన్న వార్తల నేపథ్యంలో జగన్ నేరుగా భార్యభర్తలిద్దరు ఒకే పార్టీలో ఉండాలని పురందేశ్వరికి బీజేపీకి రాజీనామా చేయించాలని అల్టిమేటం జారీ చేసినట్టు కూడా తెలిసింది.

అయితే పురందేశ్వరి మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీని వీడి వైసీపీలోకి వచ్చే ఆలోచనలో లేరు. ఈ నేపథ్యంలోనే దగ్గుబాటి వైసీపీని వీడి బీజేపీలోకి వెళ్లి పోవాలన్న ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పురంధేశ్వరి దగ్గుబాటితో కలిసి బీజేపీ పెద్దలను కలిసినట్టు సమాచారం. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని దగ్గుబాటి వెంకటేశ్వరరావు బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ఇక జాతీయ పార్టీలో చేరి తమ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్న దగ్గుబాటి బీజేపీ దిశగానే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పురందేశ్వరి బీజేపీలో కొనసాగితే ఆమెకు రాజ్యసభ లేదా ఏదైనా కీలక పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ ఎంపీగా పోటీ చేసిన ఆమె ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఏదేమైనా జగన్ దగ్గుబాటికి అల్టిమేటం జారీ చేస్తే దానికి సమాధానంగా దగ్గుపాటి ఫ్యామిలీ వైసీపీకి షాక్ ఇస్తూ బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇక వైసిపి నాయకులు కోరుకున్నది కూడా అదే అని ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news