దుబ్బాకలో బీజీపీ అభ్యర్ధి రఘునందన్ రావు గెలిచిన నేపధ్యంలో ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో విజయం సాధించిన తెలంగాణ ఉద్యమకారుడు రఘునందన్ రావు అంటూ సంబోధించిన ఆయన ఆయనకు అభినందనలు తెలిపారు. ఇది బీజేపీ గెలుపు కాదు… రఘునందన్ రావ్ గెలుపు అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ కు ఓట్లు వేసిన దుబ్బాక ప్రజలకు కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ఆశించిన ఫలితం రాకపోయినప్పటికీ .. కేసీఆర్ దుర్మార్గపు పాలన అంతానికి నాంది లాంటిదేనని అన్నారు. దుబ్బాక ఫలితాలు కేసీఆర్ కు చెంపపెట్టులాంటిదన్న ఆయన దుబ్బాక ప్రజలు కేసీఆర్ కు కర్రు కాల్చి వాతపెట్టారని అన్నారు. అడ్డదారిలో సంపాదించిన డబ్బుతో గెలవొచ్చు అనుకున్న కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ది చెప్పారని అన్నారు. మల్లన్న సాగర్ రైతుల ఉసురు కేసీఆర్ కు తగిలిందని ఈ ఫలితాలతోనైనా కేసీఆర్ కళ్ళు తెరవాలని అన్నారు. టీఆర్ఎస్ ఓట్ల షేరింగ్ బీజేపీకి వెళ్ళిందన్న ఆయన ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందేమో చూడాలని అన్నారు.