మధ్యప్రదేశ్ ఇందౌర్‌లో శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. రామయ్య కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులు మెట్లబావిపై కూర్చున్నారు. పైకప్పు కూలిపోవడంతో వారంతా బావిలో పడిపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 35 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అసలేం జరిగిందంటే..?
ఇందౌర్‌లోని పటేల్ నగర్లో బేలేశ్వర్ మహదేవ్ ఆలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాములవారి కల్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రద్దీ ఎక్కువ కావడం వల్ల కొందరు భక్తులు సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు మెట్లబావిపైకి ఎక్కారు. ఒక్కసారిగా బరువు పడటంతో బావి పైకప్పు కూలిపోయి వారంతా బావిలో పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొంతమంది భక్తులను నిచ్చెనల సాయంతో పైకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 35 మంది మృతి చెందారు. మరో 18 మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో 19 మందిని రక్షించినట్లు నగర పోలీస్ కమిషనర్ తెలిపారు.