టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం బీభత్సం విలయం సృష్టించింది. ప్రకృతి ప్రకోపాని ఈ రెండు దేశాలు అల్లకల్లోలమయ్యాయి. రెండు దేశాల్లో ఇప్పటి వరకు 1800కు పైగా మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఇవాళ తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది. భూకంప తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 1800 మందికి పైగా మృత్యువాత పడగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మరోవైపు, టర్కీలో దశలవారీగా భూ ప్రకంపనలతో జనం ప్రాణభయంతో భీతిల్లిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
మరోవైపు టర్కీ, సిరియా దేశాల్లో ప్రకృతి వైపరీత్యానికి యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆ దేశాలకు ఆపన్నహస్తం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. భారత్ సహా నెదర్లాండ్స్, గ్రీస్, సెర్బియా, స్వీడన్, ఫ్రాన్స్ తదితర దేశాలు సహాయక సామగ్రి, ఔషధాలు వంటివి పంపిస్తామని హామీ ఇచ్చాయి.