ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుతో ఈసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోకి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా ఏయే స్థానాలు ఎక్కడ అనేది దాదాపు ఖరారు అయింది. అయితే కొన్ని స్థానాల్లో మాత్రం పలువురు నేతలు స్వతంత్రంగానైనా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ముఖ్యంగా ఉండి స్థానం పై ఉద్రిక్తత నెలకొంది అనే చెప్పాలి. ఉండి ఎమ్మెల్యే రామరాజు టీడీపీ అధినేత ఇవాళ చంద్రబాబును కలవనున్నారు. ఉండి టికెట్ పై ఆయన స్పష్టత తీసుకునేందుకు చర్చలు జరుపనున్నారు. ఉండి టికెట్ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామరాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రెబల్ గానైనా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. మరోవైపు ఎమ్మెల్యే రామరాజు అనుచరులు కచ్చితంగా ఉండి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం మరో రెండు రోజుల్లో ఉండి ఎమ్మెల్యే టికెట్ అంశం స్పష్టత వచ్చే అవకాశం ఉందని తాజాగా వెల్లడించారు.