ఐపీఎల్ 13 సీజన్ శనివారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఆరంభ మ్యాచ్‌లో ముంబైపై చెన్నై అద్భుత విజయం సాధించింది. ఇక ఈ టోర్నీలో రెండో మ్యాచ్ ఇవాళ ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య జరగనుంది. అబుధాబి స్టేడియంలోనే మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. అయితే ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఢిల్లీ, పంజాబ్ జట్లు ఎన్ని సార్లు తలపడ్డాయి ? ఎవరిపై ఎవరు ఎక్కువ ఆధిపత్యం సాధించారు ? అంటే…
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఢిల్లీ, పంజాబ్ జట్లు 24 సార్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లలో పంజాబ్ ఎక్కువ గేమ్‌లు గెలిచింది. మొత్తం 14 మ్యాచ్‌లలో పంజాబ్ గెలవగా ఢిల్లీ 10 సార్లు గెలిచింది. అయితే నిజానికి ఈ రెండు జట్లు సమ ఉజ్జీలే. కాకపోతే ఢిల్లీ కన్నా పంజాబ్ కొద్దిగా మెరుగైన స్థానంలో ఉందని చెప్పవచ్చు. ఇక ఢిల్లీకి శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహిస్తుండగా.. పంజాబ్‌కు కేఎల్ రాహుల్ కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. దీంతో కేఎల్ రాహుల్ సారథ్యంలో ఈసారి పంజాబ్ ఎలాంటి ప్రదర్శన ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక ఢిల్లీ టీంలో పృథ్వీ షా, శిఖర్ ధావన్, షిమ్రాన్ హిట్‌మైర్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మార్కస్ స్టాయినిస్, అశ్విన్, రబాడా, ఇషాంత్ శర్మ, రహానే, మిశ్రా వంటి కీలక ప్లేయర్లు ఉండగా.. పంజాబ్ టీంలో కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, నికోలాస్ పూరన్, గ్లెన్ మాక్స్‌వెల్, జేమ్స్ నీషమ్, షమీ, క్రిస్ జోర్డాన్, షెల్డాన్ కాట్రెల్ వంటి ప్లేయర్లు ఉన్నారు. దీంతో ఇరు జట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది.