దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన ఐపీఎల్ 7వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. చెన్నైపై ఢిల్లీ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. గత మ్యాచ్‌లో ధోనీ సేన రాజస్థాన్ జట్టుపై పేలవమైన ప్రదర్శన ఇచ్చినట్లుగానే ఈ మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేదు. ఢిల్లీ విసిరిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై తడబడింది. ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోతూ వచ్చింది. దీంతో ఢిల్లీ చెన్నైపై సునాయాసంగా విజయం సాధించింది.
మ్యాచ్‌లో ముందుగా చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా ఢిల్లీ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లను మాత్రమే కోల్పోయి 175 పరుగుల భారీ స్కోరు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో పృథ్వీ షా (64 పరుగులు, 9 ఫోర్లు, 1 సిక్సర్), రిషబ్ పంత్ (37 పరుగులు నాటౌట్, 5 ఫోర్లు), శిఖర్ ధావన్ (35 పరుగులు, 3 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించారు. చెన్నై బౌలర్లలో పీయూష్ చావ్లా 2 వికెట్లు తీశాడు. శామ్ కుర్రాన్ కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై బ్యాట్స్‌మెన్లలో డుప్లెసిస్ (43 పరుగులు, 4 ఫోర్లు) ఒక్కడే మెరుగైన ప్రదర్శన చేశాడు. మిగిలిన వారందరూ తేలిపోయారు. ఢిల్లీ బౌలర్లలో రబాడా 3 వికెట్లు తీయగా, నొర్జె 2 వికెట్లే తీశాడు. అక్షర్ పటేల్‌కు 1 వికెట్ దక్కింది.