జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ అనే కొత్త కార్యక్రమంతో మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల తీర్చేందుకు సన్నద్దం అయింది ఏపీ సర్కార్. ఈ స్కీమ్ ద్వారా మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో నివాస స్ధలాలు లభించనున్నాయి. ప్లాట్లు కేటాయించి వారి సొంతింటి కలను సాకారం చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం..మొదటి దశలో అనంతపురము జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు, వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులలో లేఔట్లు ఏర్పాటు చేసింది.
ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్‌లో ఈ ఇంటి స్థలాల దరఖాస్తుల స్వీకరణ ఉండనుంది. ఇక త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఎమ్ఐజీ పథకం అమలు కానుంది. ఇవాళ క్యాంప్ కార్యాలయం నుంచి వెబ్‌సైట్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్. రూ. 18 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన అర్హులైన కుటుంబాలకు రాష్ట్రంలో వారు ఉంటున్న ప్రాంతంలో సరసమైన ధరలకు నివాస స్ధలాల కేటాయించనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి లేఔట్‌లో 10 శాతం ప్లాట్లు, 20 శాతం రిబేటుతో ఇంటి స్థలాలను కేటాయించనున్నారు. అన్ని పట్టణాభివృద్ది సంస్ధల ద్వారా పట్టణ ప్రణాళికా విభాగ నియమాల మేరకు ఒక సంవత్సర కాలంలో సమగ్ర లేఔట్ల అభివృద్ది జరిగింది. ఒక సంవత్సర వ్యవధిలో 4 వాయిదాలలో చెల్లించే సౌకర్యం కూడా కల్పించింది సర్కార్. చెల్లింపు పూర్తయిన వెంటనే డెవలప్ చేసిన ప్లాట్ లబ్ధిదారునికి స్వాధీనం చేయనుంది. https://migapdtcp.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ స్కీమ్ కోసం దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు.