కూతుళ్ళని చంపిన తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజలకు ప్రభుత్వ మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ రాధిక వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉన్న వ్యాధిని బయటపెట్టారు. పద్మజ తండ్రి మానసిక వ్యాధితో బాధపడుతూ ఇటీవలే చనిపోయారు. పద్మజ మేనత్త కూడా మానసిక సమస్యతో ప్రస్తుతం బాధపడుతోందని, పద్మజ కూడా తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని దీన్ని మానసిక శాస్త్రంలో డెల్యూషన్స్ అంటారని పేర్కొన్నారు. ఈ వ్యాధిగ్రస్తులు తాము నమ్మిన విషయాన్ని బలంగా విశ్వసిస్తారు.
అదే నిజమని భావిస్తూ ఉంటారని, పద్మజ కొన్ని నెలలుగా ఈ వ్యాధితో బాధపడుతోందని తేల్చారు. తనకున్న మానసిక సమస్యని భర్త, కూతుళ్లకు కూడా ఆమె అంటించింది. దీన్నే వైద్య పరిభాషలో ‘షేర్ డెల్యూషన్స్’ అంటారని పేర్కొన్నారు. ఈ జంట హత్యల కేసుపై చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ పోలీసులు సత్వరమే వెళ్లడంతో మానసిక దుర్బలత్వంతో ఉన్న నిందితుల ప్రాణాలు మిగిలాయని, తీవ్రమైన ఆధ్యాత్మిక చింతన, విచిత్రమైన మానసిక స్థితి లో ఉన్నారని అన్నారు, విపరీతమైన మూఢనమ్మకాలు విచిత్రమైన ఆధ్యాత్మిక ప్రవర్తన తో హత్యలు జరిగినట్టు భావిస్తున్నామన్న ఆయన ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు అనిపించడంలేదని అన్నారు.