ఏపీ సీఎస్, ఎస్ఈసీకి రాజ్ భవన్ నుండి పిలుపు ?

ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ భేటీ అనంతరం తాము ఖచ్చితంగా ఎన్నికల నిర్వహణలో పాల్గొంటామని కాకపోతే తమ ప్రాణాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని వారు కోరారు.

అయితే ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ అలాగే ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ఇద్దరికీ రాజ్ భవన్ నుంచి పిలుపు అందింది. ఉదయం 10 గంటలకు గవర్నర్ తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ సమావేశం కానున్నారు. అలాగే పదిన్నరకు ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ గవర్నర్ తో భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గురించి వీరు చర్చించనున్నారు అని చెబుతున్నారు. ఇక ఈ రోజు రెండో విడత నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎల్లుండి నుంచి నామినేషన్లు మొదలు కానున్నాయి.