బాలీవుడ్ వర్ధమాన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ (34) ఆత్మహత్య అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇప్పుడిప్పుడే సినిమా కెరీర్‌లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంటున్న సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఇలా బలవన్మరణానికి పాల్పడడం బాలీవుడ్ సినీ ప్రముఖులనే కాదు, యావత్ భారత సినీ ప్రేక్షకులను విచారంలోకి నెట్టేసింది. ముంబైలో గత కొద్ది నెలలుగా ఒంటరిగా ఉంటున్న సుశాంత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అందుకు కారణం గత కొద్ది రోజులుగా అతను అనుభవిస్తున్న డిప్రెషనే అని తెలుస్తోంది.
సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ పాట్నాలో జన్మించాడు. అతనికి 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు 2002లో తల్లి చనిపోయింది. దీంతో తండ్రి సంరక్షణలో అన్న, సోదరిలతో కలసి అతను పెరిగాడు. అతని అన్న నీరజ్ కుమార్ బబ్లూ అక్కడ ఎమ్మెల్యే. అతని వదిన బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే సుశాంత్ సింగ్ సినిమాల్లోనే కాదు.. చదువుల్లోనూ దిట్టే. ఏఐట్రిపుల్ఈలో ఆలిండియా లెవల్‌లో 7వ ర్యాంకును సాధించాడు. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ పొందాడు. ఫిజిక్స్ ఒలంపియాడ్ గెలుచుకున్నాడు. తరువాత పవిత్ర రిష్తా అనే సీరియల్‌లో లీడ్ రోల్‌లో నటించాడు. అనంతరం అభిషేక్ కపూర్ తీసిన కోయి పొ చె సినిమా ద్వారా అతను బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు.
ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పూత్.. మహేంద్ర సింగ్ ధోని బయోపిక్.. ఎంఎస్ ధోనిలోనూ నటించి అందరి మెప్పు పొందాడు. అలాగే పలు హిట్ సినిమాల్లోనూ అతను నటించాడు. 2019లో చివరిసారిగా అతను చిచోరే మూవీలో నటించాడు. కాగా సుశాంత్ గత కొద్ది నెలలుగా ముంబైలోని బాంద్రాలో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. అయితే అతను చివరిసారిగా ఇన్‌స్టాగ్రాంలో తన తల్లిని బాగా మిస్ అవుతున్నట్లు పోస్ట్ పెట్టాడు. అందులో అతను చాలా బరువైన పదాలను ఉపయోగించాడు. వాటిని బట్టి చూస్తే తన తల్లి గుర్తుకు వచ్చి ఉంటుందని.. దాంతోపాటు గత కొంత కాలంగా ఒంటరిగా ఉండడం వల్ల వచ్చిన డిప్రెషన్‌తో.. తీవ్ర మనస్థాపానికి గురై సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తెలుస్తోంది.
అయితే ఇటీవలే సుశాంత్ మాజీ మేనేజ్ దిశ సలియన్ 14 అంతస్థుల ఓ భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ సంఘటనను మరువక ముందే ఇప్పుడు సుశాంత్ ఇలా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టిస్తోంది. అయితే అసలు అతని ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.