దేశ ఆర్థిక ప్రగతిని మంత్రి నిర్మలా సీతారామన్ ఎంతగానో ప్రభావితం చేస్తున్నారు. వీలున్నంత మేర కోతలు విధిస్తూ, వీలున్నంత వరకూ పన్నులు వేస్తూ ఏ రంగానికీ చేరువగా లేకుండా ఉన్నారన్న విమర్శలను మోస్తున్నారు. తెలుగింటి కోడలుగా ఉంటూ ఆమె చేసిందేం లేదన్న వాదనకు బలం చేకూర్చుతున్నారు. ఇదే సమయంలో ఆంధ్రా రాజకీయాల్లో శ్రీకాకుళం ఇంటికోడలు, డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి ఉన్నారు. ఆమె కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కాని లేదా శ్రీకాకుళం జిల్లాను కానీ పట్టించుకోవడం లేదు అన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.
వరుసగా రెండు సార్లు కురుపాం నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఆమె.. వైసీపీకి వీర విధేయురాలు. అంతా ఊహించిన దానికి భిన్నంగా ఆమెను జగన్ డిప్యూటీ సీఎంను చేశారు. అప్పటి నుంచి ఆమె ఎక్కడా కనిపించడమే మానేశారు.ఎక్కడా ఆమె మాట్లాడడమే మానుకున్నారు. విజయనగరంలో బొత్స ఆధిపత్య ధోరణి కారణంగానే ఆమె సైలెంట్ అయిపోయారే అనుకుందాం.. పోనీ శ్రీకాకుళం గిరిజన ప్రాంతంపై అయినా కాస్తయినా ప్రేమ ఉంచాలి కదా! కానీ ఆమె ఈ ప్రాంతాన్నికూడా పట్టించుకోవడం లేదు.
గిరిజన శాఖ మంత్రిగా ఉంటూ కూడా ఆమె ఇటుగా రావడం లేదు. శ్రీకాకుళం జిల్లా, సీతంపేట ఐటీడీఏ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. సమీక్షా సమావేశాలకు గైర్హాజరవుతున్నారు.అంతేకాదు సొంత నియోజకవర్గం కురుపాంపై కూడా ఆమెకు ప్రేమ లేదని తేలిపోయింది. ఒకనాడు ఆమె ఎంతో క్రియాశీలకంగా ఉండేవారు. ప్రజా సమస్యలపై స్పందించేవారు. ఇదంతా 2014 – 19 మధ్య కాలం నాటి మాట. కానీ ఆమెకు అధికారం దక్కాక ప్రజా సమస్యల పరిష్కారం విషయమై ఏ పాటి శ్రద్ధ కూడా చూపించడం లేదు. దీంతో మన్యం ప్రాంతంలో అభివృద్ధి పనులేవీ జరగడం లేదు. అసలే అరకొర డబ్బులతో వసతులతో నడిచే ఈ ప్రాంత పాలక వ్యవస్థపై అస్సలు పట్టు లేకుండా ఆమె ఉన్నారని విమర్శ ఒకటి వినిపిస్తోంది.