తెలంగాణలో లాక్ డౌన్‌కు సంబంధించి ఎలాంటి సడలింపులు ఉండవని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇకపై లాక్ డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయనున్నట్టు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. లాక్ డౌన్ అమలుపై నిర్వహించిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రోడ్లపైకి అనవసరంగా వచ్చే వాహనదారుల నియంత్రణపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అవసరం లేకుండా బయటకు వచ్చే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారి పాస్‌లను రద్దు చేస్తామన్నారు. ఇప్పటికే ఇచ్చిన పాస్‌లను వెనక్కి తీసుకుని కొత్త పాస్‌లిస్తామని తెలిపారు. వాహదారులు రెసిడెన్స్ ఫ్రూప్‌తోనే బయటకు రావాలని కోరారు. ఆస్పత్రులకు వెళ్లేవారు కూడా రెసిడెన్స్ ఫ్రూఫ్ తీసుకుని వెళ్లాలని సూచించారు. 3 కి.మీ పరిధిలోని ఆస్పత్రులకు వెళ్లాలని.. తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉండి దూరం వెళ్తే రిఫరెన్స్ పత్రాలు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక పాస్‌లు ఇస్తామని డీజీపీ వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలు సీజ్ చేస్తున్నామని.. ఇప్పటివరకు 1.21 లక్షల వాహనాలు సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. వాటిని లాక్ డౌన్ ముగిసిన తర్వాత కోర్టు ద్వారా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మాస్క్‌లు ధరించాలని.. భౌతిక దూరం పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.