అమ్మాయిలకు అలక అందంగానే ఉంటుంది. అలిగితివా సఖీ..అలక మానవా అని సత్య భామా దేవిని కృష్ణుడు ఎంతగా బుజ్జగించాడో కదూ ! ఆ ఘటనలను ఎలా మరువగలం.అదేవిధంగా ఎన్నో సందర్భాల్లో అమ్మాయిలు తాము అనుకున్నది సాధించేందుకు అలక తప్ప మరో అస్త్రం ఉపయోగించరు కూడా! ఆ విధంగా ఆడాళ్లందరికీ అలకే ఆయుధం అయిపోయింది. తాజాగా అలియాకు కూడా అలక బూనింది. బుంగమూతి కూడా పెట్టుకుంది. అదేదో సినిమాలో సమంత చెప్పిన విధంగా ఐ హర్టు అని కూడా అని అంటోంది.
ఏంటి ఇదంతా నిజం అనుకుంటున్నారా? కాదు ఆమెకు సంబంధించి ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ కు సంబంధించి తన పాత్ర నిడివి తగ్గించిన విధానంకు సంబంధించి వస్తున్న వార్తలపై అలియా స్పందించిన తీరు ఎంతో హుందాగా ఉంది. ఇటీవల ఆమె ఇన్ స్టాలో రాజమౌళిని అన్ ఫాలో చేశారని వార్తలొచ్చాయి. ట్రిపుల్ ఆర్ వీడియోలూ డిలీట్ చేశారు. ఇది మాత్రం నిజం.దీనిపై తాను ఎప్పటికప్పుడు ఇన్ స్టాను అప్డేట్ చేసేందుకు ఇష్టపడతానని ఆ క్రమంలో యాదృశ్చికంగానే వీడియోలు తొలగించానని, ఇలాంటి చర్యల ఆధారంగా తనపై ఎవ్వరూ తప్పుడు అంచనాలకు రావొద్దని వేడుకున్నారు. ట్రిపుల్ ఆర్ ప్రపంచంలో భాగం అయినందుకు తనెంతో సంతోషిస్తున్నానని చెప్పారు. సీత పాత్రలో నటించడాన్ని, ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో నటించడాన్ని ఎంతగానో ఇష్టపడ్డానని కూడా స్పష్టం చేస్తూ ఇప్పటిదాకా ఉన్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టారు.
ఇక అలియా ఈ సినిమా ప్రయాణాన్ని ఇష్టపడ్డానని చెబుతూనే, యువ హీరోలతో తాను నటించడాన్ని కూడా ఎంతగానో ప్రేమిస్తున్నానని తెలిపారు. ఇప్పుడు అలియాకు అలక లేదు. ఆమె నటించిన సినిమా ట్రిపుల్ ఆర్ పై ఎటువంటి అపోహలూ లేవు. చేసే పనినే ప్రేమించే అలియా లాంటి నటులు మరింత మంది భారతీయ సినిమాకు అవసరం అన్నది మాత్రం గుర్తించండి.
ఒకవేళ ఆమె తన పాత్ర నిడివి తగ్గించారనో లేదా పెంచారనో ఇలాంటి వాటిపై దర్శకుడికి కావాలంటే ఫిర్యాదు చేయగలరు కానీ చిన్న పిల్లల చేష్టలు అయితే చేయరు.కనుక అబద్ధపు ప్రచారాల కారణంగా వ్యక్తుల మధ్య దూరం పెంచకండి.
ఆ విధంగా ఎవ్వరు చేసినా తప్పే! అయితే అలియా లాంటి అమ్మాయిలను మరింత విస్తృతి ఉన్న క్యారెక్టర్లలో తీసుకుంటే మేలు అని చెప్పండి ఎవ్వరూ కాదనరు. అయినా నేను నటించిన గంగూభాయ్ ఎందరు చూశారని..? అదంతా స్త్రీ ప్రాధాన్యంతో ముడి పడి ఉన్న సినిమా కదా! మరి పట్టించుకున్నారా మీరు అని అలియా ఎదురు ప్రశ్నిస్తే ఏమౌతారో ఈ ట్రోలర్స్ !