కడప జిల్లా అంటేనే టక్కున గుర్తొచ్చేది ఫ్యాక్షన్. పలు సినిమాల్లో కూడా భూతద్దంలో చూపించిన ఘటనలు, గతంలో జరిగిన కొన్ని అనుభవాలు ఈ ముద్ర పడడానికి కారణంగా చెప్పవచ్చు. అయితే కాలం మారింది, ఫ్యాక్షన్ పూర్తిగా మాసిపోయిందని పోలీసులు పదేపదే చెబుతుంటారు. కానీ నేటికీ జిల్లాలో గన్ కల్చర్ కొనసాగుతూనే ఉంది. తాజాగా కడప జిల్లా పులివెందులలో కాల్పుల మోత మోగింది. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు.
ఈ కాల్పుల ఘటనలో దిలీప్, మహబూబ్ భాషా కు గాయాలు అయ్యాయి. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తికి, దిలీప్ కు ఉన్న ఆర్థిక వివాదాల నేపథ్యంలో పులివెందుల వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ కాల్పులు జరిగాయి. భరత్ కుమార్ ఐదు రౌండ్లు కాల్పులు జరపగా.. దిలీప్, మహబూబ్ భాషా గాయపడ్డారు. వీరిని పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే దిలీప్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని కడప రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో వేంపల్లి వద్ద మృతి చెందాడు.