జిల్లాల విభజన అంశంపై ఏపీలో పెద్ద ఎత్తున రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే..ఇటీవల జగన్ ప్రభుత్వం జిల్లాల విభజన చేసిన విషయం తెలిసిందే. 13 జిల్లాలని కాస్త 26 జిల్లాలుగా చేసింది. అయితే ఈ విభజనపై కొన్ని జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు…కానీ కొన్ని జిల్లాల ప్రజలు మాత్రం విభజనపై ఆందోళన చేస్తున్నారు. జిల్లాల విభజన జరిగిన దగ్గర నుంచి ప్రజలు ఆందోళన బాటపట్టారు. అలాగే రాజకీయ పార్టీలు కూడా ఆందోళన ఉదృతం చేశాయి..ఈ క్రమంలోనే కొన్ని జిల్లాల్లో వైసీపీ నేతలు కూడా ఆందోళనలు చేయాల్సిన పరిస్తితి వచ్చింది.
ఇప్పటికే పలు జిల్లాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి..నరసాపురం పార్లమెంట్‌ని సెపరేట్‌గా జిల్లా చేసి…భీమవరం కేంద్రంగా పెట్టడంపై నరసాపురం ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇటు విజయవాడకు దగ్గర ఉన్న పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలని మచిలీపట్నంలో కలపడంపై ఆందోళన జరుగుతుంది. ఇక తమ ప్రాంతం ఒంగోలుకు దగ్గర ఉంటే…తీసుకొచ్చి బాపట్ల జిల్లాలో కలపడంపై అద్దంకి నియోజకవర్గ ప్రజలు ఆందోళన చేస్తున్నారు.
అటు కందుకూరు రెవెన్యూ డివిజన్‌ని రద్దు చేయడమే కాకుండా..దగ్గర ఉన్న ఒంగోలులో కాకుండా..నెల్లూరు జిల్లాలో కలిపారు. దీనిపై కందుకూరు ప్రజలు పోరాటం చేస్తున్నారు…ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కూడా ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక మదనపల్లెని సెపరేట్ జిల్లాగా చేయాలని ఉద్యమం నడుస్తోంది. అలాగే రాజంపేట పార్లమెంట్‌ని సెపరేట్‌గా జిల్లా చేసి..రాయచోటిని కేంద్రంగా పెట్టడంపై ఉద్యమం జరుగుతుంది…రాజంపేటని కేండ్రంగ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అలాగే హిందూపురం పార్లమెంట్‌ని సెపరేట్‌గా జిల్లాగా చేసి..కేంద్రంగా హిందూపురంని కాకుండా పుట్టపర్తిని పెట్టారు. దీనిపై హిందూపురం ప్రజలు ఆందోళన చేస్తున్నారు..ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు. అలాగే ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ని రద్దు చేయడంపై పరిటాల శ్రీరామ్ దీక్షకు దిగారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల జగడం నడుస్తోంది…ఈ జగడం కాస్త వైసీపీకి గండంగా మారేలా ఉంది.