ఈనెల 24న తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘దీపావళి ఆస్థానం’

-

దీపావళి పండుగకు తిరుమల శ్రీవారి ఆలయం ముస్తాబవుతోంది. శ్రీవారి సన్నిధిలో ఈనెల 24 న‌ ‘దీపావళి ఆస్థానం’ నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు ఉండటంతో అందుకు అనుగుణంగా బోర్డు ఏర్పాట్లు చేసింది.

దీపావళి పర్వదినం రోజున ఉదయం 7 నుంచి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. ఆస్థానంలో భాగంగా శ్రీ మలయప్ప స్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు.

అదేరోజున సాయంత్రం 5 నుంచి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామివారు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని, ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో విహరించి భ‌క్తుల‌కు కనువిందు చేస్తారు. దీపావ‌ళి ఆస్థానం నేపథ్యంలో అక్టోబర్ 24న క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news