మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్య కుట్రపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర పన్నారంటూ సైబరాబాద్ పోలీసులు మహబూబ్ నగర్ యువకులపై ఫాల్స్ కేసు పెట్టారని… ఈ కేసు వెనుక రాజకీయ, ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొంత మంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని… ఎన్నికల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు ఆఫిడవిట్ సమర్పించాడని కొందరు వ్యక్తులు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారని తెలిపారు. మహబూబ్ నగర్ లో మంత్రి అవినీతి, కబ్జాలపై వీళ్ళు సోషల్ మీడియా వేదిక గా ప్రశ్నిస్తున్నారని.. ఇది తట్టుకోలేని మంత్రి వీళ్లపై కక్షగట్టి వారం కిందట కిడ్నాప్ చేయించాడని నిప్పులు చెరిగారు.
బాధితుల భార్యా, పిల్లలు నా దగ్గరకు వస్తే నేను ఈ కిడ్నాప్ వ్యవహారం పై మాట్లాడానని.. ఇది పూర్తిగా రాజకీయ కుట్రతో పెట్టిన కేసు అన్నారు. మహబూబ్ నగర్ లో అరాచకం చేస్తున్న మంత్రి తనపై సానుభూతి తెచ్చుకునేందుకు హత్య కు కుట్ర అని కేసు పెట్టించుకున్నాడని.. కానీ అక్కడి ప్రజలకు వాస్తవాలు తెలుసని వెల్లడించారు. సైబరాబాద్ సీపీ ప్రెస్ మీట్ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని.. అవకాశం ఉన్న అన్ని విచారణ సంస్థలను, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.