ఒక పక్క ప్రజలంతా కరోనా మహమ్మారి దెబ్బకి హడలిపోతుంటే.. ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం కాసుల కోసం కక్కుర్తి పడుతున్నాయి. తాజాగా.. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను చాదర్ ఘాట్ లోని తుంబె ఆసుపత్రిలో నిర్బంధించారంటూ హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రి డీఎంవో సుల్తానా ఓ సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు. కొవిడ్-19 లక్షణాలతో తాను ఈ ఆసుపత్రిలో చేరానని, అయితే, 24 గంటలకు రూ.1.15 లక్షల బిల్లు వేశారని తెలిపారు.
అంత బిల్లు ఎందుకని అడిగినందుకు ఆ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది ఈ దారుణానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందిస్తూ… సుల్తానా తమ ఆస్పత్రిలో అసిస్టెంట్ సివిల్ సర్జన్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. రెండ్రోజుల క్రితం పరీక్షలో సుల్తానాకు కొవిడ్ పాజిటివ్‌గా తేలిందన్నారు. కాగా ఆస్పత్రి యాజమాన్యానికి చెప్పకుండానే ఆమె ప్రైవేటు ఆస్పత్రిలో చేరారన్నారు.