కరోనా వైరస్ నేపథ్యంలో హెర్డ్ ఇమ్యూనిటీపై దేశాలు ఆశలు పెట్టుకోవద్దని, కచ్చితంగా వ్యాక్సిన్ రావాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుందని, అయితే హెర్డ్ ఇమ్యూనిటీపై ఎలాంటి ఆశలు పెట్టుకోకూడదని అన్నారు. వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా తెచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని అన్నారు.
కరోనా వ్యాక్సిన్‌ను ముందుగా కోవిడ్ వారియర్లకు పంపిణీ చేయాలని అన్నారు. అలాగే వ్యాక్సిన్‌ను పేద దేశాలకు కూడా ముందుగానే అందుబాటులో ఉండేలా ఇతర దేశాలు సహకారం అందించాలన్నారు. వ్యాక్సిన్ ఏ ఒక్క దేశానికీ పరిమితం కాకూడదన్నారు. కరోనా రిస్క్ ఎక్కువగా ఉండేవారికి ముందుగా వ్యాక్సిన్‌ను అందిస్తే ఆ మహమ్మారిని త్వరగా జయించవచ్చని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో లెక్కకు మించిన వ్యాక్సిన్లపై ట్రయల్స్ జరుగుతుండడం శుభ పరిణామమన్నారు.
కరోనా వచ్చే రిస్క్ ఎక్కువగా ఉండేవారిని ముందుగా రక్షించుకోకపోతే పెద్ద ఎత్తున ఈ వైరస్ వల్ల చనిపోయేందుకు అవకాశాలు ఉంటాయని టెడ్రోస్ అన్నారు. కరోనా నుంచి బయట పడకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత పతనం అవుతుందని అన్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అనేక దేశాల్లో కొందరు కరోనా ఇమ్యూనిటీ సాధించారని, అది మంచి పరిణామమే అయినా.. ఆ వైరస్‌ను పూర్తిగా నిర్మూలించాలంటే వ్యాక్సిన్ ఒక్కటే ఉత్తమమైన మార్గం అని అన్నారు.