ఇంటర్నెట్‌ను మనం నిత్యం ఎన్నో పనులకు ఉపయోగిస్తుంటాం. సమాచారం కోసం, విజ్ఞాన అన్వేషణ కోసం, ఇతర పనుల కోసం నెట్‌ను వాడుకుంటుంటాం. అయితే జనాల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు ఏకంగా నకిలీ వెబ్‌సైట్లనే క్రియేట్ చేసి వాటిని అసలు సైట్లుగా నమ్మిస్తూ జనాలను మోసం చేస్తున్నారు. ఇంకా వింత ఏమిటంటే.. ఈ సైట్లలో ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, స్కాలర్‌షిప్‌లను ఇస్తామని మభ్య పెడుతున్నారు. దీంతో నిజమే అని నమ్మే కొందరు వాటిల్లో తమ వివరాలను ఎంటర్ చేసి అడ్డంగా బుక్ అవుతున్నారు. పెద్ద ఎత్తున డబ్బులను నష్టపోతున్నారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఎప్పటికప్పుడు నకిలీ వార్తలను గుర్తించి వాటి పట్ల జనాలను అప్రమత్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో నకిలీ వార్తల సంఖ్య బాగా పెరిగిపోయింది. అయితే దీనికి తోడు నకిలీ సైట్లు కూడా పెద్ద ఎత్తున చెలామణీ అవుతున్నాయి. వాటిలో కొన్ని సైట్లను ఇప్పటికే పీఐబీ గుర్తించి వాటి వివరాలను తెలియజేసింది. ఆ వెబ్‌సైట్లు ఏమిటంటే…
https://centralexcisegov.in/aboutus.php
https://register-for-your-free-scholarship.blogspot.com/
https://kusmyojna.in/landing/
https://www.kvms.org.in/
https://www.sajks.com/about-us.php
http://register-form-free-tablet.blogspot.com/
పైన తెలిపిన 6 వెబ్ సైట్లు నకిలీ అని, వాటితో ప్రభుత్వాలకు ఎలాంటి సంబంధం లేదని, కనుక వాటిని నమ్మి ఓపెన్ చేయవద్దని, వాటిల్లో సమాచారం ఎంటర్ చేయవద్దని పీఐబీ హెచ్చరించింది. జనాలను బుట్టలో పడేసి వారి సమాచారాన్ని చోరీ చేసేందుకు లేదా వారి నుంచి డబ్బులు కొట్టేసేందుకు ఇలాంటి నకిలీ సైట్లను కొందరు సృష్టిస్తున్నారని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.