పండ్లలో అందరికి ఇష్టం ఉండే పండు మామిడి పండు. వచ్చేది వేసవికాలం..ఇంకా కొన్ని నెలల్లో మామిడిపండల్ సీజన్ వచ్చేస్తుంది. అధికదిగుబడి, నాణ్యమైన పంట ఉత్పత్తికోసం సరైన యాజమాన్య పద్దతులను రైతులు పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెగుళ్ళ విషయంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచి పంట దిగుబడిని పొందవచ్చు.
తేనె మంచు పురుగు: లీటరు నీటికి ఫాస్పామిడాన్ 0.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేదా కార్బరిల్ 3 గ్రాములు లేదా డైమిథోయేట్ రెండు మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లలో కలిపి చెట్టులో పూత, పిందె వచ్చే సమయం పూత, ఆకులపై కాకుండా మొదళ్లలో పిచికారి చేయాలి. పూలు పూర్తిగా విచ్చుకోక ముందు పిచికారి చేయాలి.
పూత బాగా ఉన్నప్పుడు పిచికారి చేసినట్లయితే పుప్పొడి రాలిపోయి పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాలు చనిపోతాయి. ఇక మొగ్గ దశలో కనిపించిన సమయంలో 3 గ్రాముల ఎడల కార్బరిల్ లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్, ఒక గ్రామ్ కార్చండిజమ్ ను లీటరు నీటిలో కలిపి వెంటనే పిచికారి చేయాలి. ఆక్లారా 0.1 మిల్లీలీటర్ ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇలా చేస్తే పూత కాపు సమయంలో తేనే మంచు పరుగు సమర్ధవంతంగా నివారించుకోవచ్చు.
కాయపుచ్చు పురుగు: గులాబి రంగు చారతో తెల్లటి లద్దె పురుగు కాయ అడుగున రంధ్రం చేసి తోలును కండను తిని సొరంగాన్ని ఏర్పరుస్తుంది. కాయ లోపలి భాగం పూర్తిగా తినేస్తుంది. ఒక కాయలో 6 నుండి 8 పురుగులు ఉంటాయి. దీని నివారణకు వేపగింజల కషాయాన్ని పిచికారి చేయాలి. పురుగు కోశస్ధ దశ, ఎండుపుల్లలు, బెరడులో గడుపుతుంది. ఎండిపోయిన మామిడి బెరడును చెట్టునుండి తొలగించాలి. అత్యవసర స్ధితిలో సైపర్ మెత్రిన్ 2ఇ.సి. 0.5మి.లీ లీటరు నీటిలో కలిపి పూత, పిందెపై పిచికారి చేయాలి.
పిండినల్లి: ఇది కాయ నుండి లేత కొమ్మల నుండి రసాన్ని పీల్చి చెట్టును బలహీన పరుస్తుంది. ఇవి విసర్జించిన తేనె వంటి జిగురై మసి తెగులు వృద్థి చెంది పండు నాణ్యతను తగ్గిస్తుంది. ఈ తేనె వంటి పదార్ధం కొరకు చీమలు వస్తాయి. డిసెంబరు, జనవరిలో చెట్టు కాండం, మొదలు చుట్టు పాలథీన్ పేపరు అడుగు వెడల్పులో కట్టాలి. లేదా జిగురు పూసి పిల్ల పురుగులు పైకి పాకకుండా ఆపవచ్చు. చెట్టు చుట్టూ వేసవిలో పాదు చేయాలి. దీని నివారణకు క్వినాల్ ఫాస్ 2మి.లీ లేదా మిథైల్ డెమటాన్ 2మి.లీ లీటరు నీటికి కలిపి చెట్టు మొదలు కొమ్మలతో సహా పిచికారి చేయాలి.
P
టెంకపురుగు నివారణ: తోతాపురి, నీలం రకాల మామిడిలో ఇది ఎక్కవగా కనిపిస్తుంది. తోటలో రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. కాయ చిన్న సైజులో ఉండగా 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పెంథియాన్ 1మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
బూడిద తెగులు: వీటిని నీటిలో కరిగే రెండు గ్రాముల గంధకం లేక ఒక మిల్లీ లీటర్ కెరాథెన్ లేదా ఒక గ్రామ్ మైకోబ్యూటనిల్ లేదా ఒక గ్రాము బేలటాస్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. అవసరాన్ని బట్టి పదిహేను రోజుల తర్వాత మందును మార్చి పిచికారి చేయాలి.
కాండం, బెరడు తొలిచే పురుగు : పాడైపోయిన కొమ్మలను తొలగించటం వల్ల దీనిని అరికట్టవచ్చు. బెరడులో పురుగులు ఉన్నట్లైతే ఇనుప చువ్వల ద్వారా వాటిని బయటకు తీసి చంపివేయాలి. ఆరంధ్రాల్లోకి లీటరు నీటికి 10మి.లీ డైక్లోరోఫాస్, లేదా మోనో క్రోటోఫాస్ కలిపి రంధ్రంలో పోసి బంకమట్టితో మూసివేయాలి.
చెదపురుగు : చెదలు ఎర్రనేలలు, ఇసుకనేలలతో కూడిన మెట్టభూముల్లో ఎక్కవగా ఉంటాయి. ఇవి వేళ్లు, బెరడును ఆశించటం వల్ల చిన్న మొక్కలు చనిపోతాయి. పెద్ద మొక్కలు బలహీనపడతాయి. నీటి ఎద్దడి ఉన్నప్పుడు సైతం వీటి బెడద అధికంగా ఉంటుంది. కొత్తగా మొక్కలు నాటే సమయంలో గుంతకు మట్టిలో అరకిలో వేపపిండి లేదా 100గ్రాముల ఫాలిడాల పొడిని కలపాలి. చెదలపుట్ట ఉన్న స్థలాన్ని గుర్తించి రాణి పురుగుతో సహా నాశనం చేయాలి. చెదలు ఆశించిన కాండంపై మట్టిపొరను తొలగించి క్లోరోఫైరిఫాస్ పిచికారి చేయాలి. కాండానికి బోర్డోపేస్ట్ 2 నుండి 3 అడుగుల ఎత్తువరకు పూయాలి.
మచ్చ తెగులు: ఎండిపోయిన కొమ్మల్ని వెంటనే తీసివేయాలి. వాటిని లీటర్ నీటికి మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ కలిపి పిచికారి చేయాలి. లీటర్ నీటిలో ఒక గ్రామ్ కార్చండిజమ్ కలిపి పూత సమయంలో 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయవచ్చు.