పోస్టాఫీస్‌లో ఈ సేవింగ్‌ స్కీమ్స్‌ తెలుసా..? తక్కువ ప్రీమియంతో ఎక్కువ వడ్డీ

-

డబ్బు పొదుపుచేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ ఆ డబ్బును ఎక్కడ పొదుపు చేయాలి. కేవలం దాస్తే సరిపోదు.. మనకు లాభం ఎంత వస్తుంది. అందులో రిస్క్‌ ఎంత ఉంటుంది. ఈ విషయాలు కూడా చాలా ముఖ్యం. మీ సేవింగ్స్‌ను కొన్ని పథకాలకు మళ్లిస్తే మంచి ఆదాయం పొందవచ్చు. ఇందుకు భారత ప్రభుత్వం వివిధ రకాల పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ స్కీమ్స్ తీసుకొచ్చింది. ఈ పథకాలు ఎక్కువ వడ్డీని ఆఫర్‌ చేస్తూ పాపులర్‌ అయ్యాయి. వీటితో అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ స్కీమ్స్ సురక్షితమైన పెట్టుబడి మార్గాలు. సకాలంలో పేమెంట్స్ అందిస్తాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన (SSY), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), కిసాన్ వికాస్ పత్ర వంటి అనేక పథకాలను పోస్టాఫీస్‌లు అందిస్తున్నాయి.

పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్ అకౌంట్‌ (TD)

పోస్టాఫీస్‌ టైమ్ డిపాజిట్ అకౌంట్‌లు ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు, ఐదు సంవత్సరాల టెన్యూర్‌తో ఉన్నాయి. కనీసం రూ.1,000 డిపాజిట్‌ చేయాలి. వడ్డీ త్రైమాసికం ప్రాతిపదికన లెక్కిస్తారు, ఏటా క్రెడిట్ అవుతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 2023 జులై 1 నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకు 1-సంవత్సరం అకౌంట్‌కి 6.9 శాతం వడ్డీ లభించింది. 2, 3 సంవత్సరాల అకౌంట్‌లకు 7 శాతం, 5 సంవత్సరాల అకౌంట్‌కి 7.5 శాతం వడ్డీ పొందవచ్చు.

పోస్టాఫీస్‌ సేవింగ్స్ అకౌంట్‌

పోస్టాపీస్‌ సేవింగ్స్ అకౌంట్‌ ఓపెన్‌ చేయడానికి కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. దేశీయ కస్టమర్లకు ఇండివిడ్యువల్‌ లేదా జాయింట్‌ అకౌంట్‌ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. పోస్టాఫీస్‌ అకౌంట్లోని డిపాజిట్లపై సంవత్సరానికి 4 శాతం వడ్డీ ఇస్తారు. అకౌంట్‌ చెక్ బుక్, ATM కార్డ్, ఇ-బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు, ఇతర సేవలను కూడా పొందవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగింపులో, వడ్డీ పోస్టాఫీస్‌ అకౌంట్‌లో క్రెడిట్‌ అవుతుంది. వ్యక్తులు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80TTA ప్రకారం ఇన్‌కమ్‌ నుంచి రూ.10,000 వరకు డిడక్షన్‌ కూడా పొందవచ్చు.

పోస్టాఫీస్‌ సేవింగ్ స్కీమ్‌ ప్రయోజనాలు

ఈ సేవింగ్స్‌ స్కీమ్స్‌లో చేరడం సులభం. గ్రామీణ, పట్టణ పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటాయి. స్థిరమైన రాబడిని కోరుకుంటే, పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో రిస్క్‌ను తగ్గించాలనుకుంటే, ఈ స్కీమ్స్‌ బెస్ట్ ఆప్షన్‌. ప్రభుత్వ మద్దతు ఉండటం మరో పెద్ద బలం. ఈ స్కీమ్స్‌ 4% నుంచి 8.2% వరకు వడ్డీరేట్లను ఇస్తాయి.

వీటిలో చాలా ప్లాన్లకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. PPF, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్స్‌ నుంచి వచ్చే వడ్డీపై ట్యాక్స్‌ ఎగ్జమ్షన్‌ ఉంటుంది.
పోస్టాఫీస్‌ స్కీమ్స్‌లో పెట్టుబడులు సాధారణంగా దీర్ఘకాలికంగా ఉంటాయి. PPF అకౌంట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ వ్యవధిని 15 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. పదవీ విరమణ కోసం కార్పస్‌ను నిర్మించాలనుకునే వారికి ఈ సేవింగ్స్‌ స్కీమ్స్‌ అనువుగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా పోస్ట్‌ఆఫీస్‌లో మీకు నచ్చిన సేవింగ్‌ స్కీమ్‌లో జాయిన్‌ అయిపోండి.

Read more RELATED
Recommended to you

Latest news