రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వైసీపీ సర్కారు రావాలని యోచిస్తుందని అందుకు విశాఖను తన అడ్డాగా చేసుకుంటోందని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. వాటికి ఊతం ఇచ్చేందుకు కొన్ని పనులు కూడా జరుగుతున్నాయి. అవన్నీ ఇప్పటికిప్పుడు అక్రమ మార్గంలో జరగకపోయినా.. నాయకుల ఎంట్రీ తరువాత ఎవరికి వారు తమ స్వార్థంలో భాగంగా ప్రభుత్వం నుంచి విలువైన భూమిని గుంజుకోవాలని యోచిస్తున్నారు అని ఇవాళ ప్రధాన మీడియా గగ్గోలు పెడుతోంది.
అయినా కూడా భూపందేరం ఆగదని కూడా తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఎండాడ సమీపాన యాభై ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న భూమి వైసీపీ పెద్దలు తమ సొంతం చేసుకునేందుకు ప్రయత్నించవచ్చు అన్నది ఓ ఆరోపణ విపక్షం నుంచి! అదేగనుక జరిగితే దివంగత నేత వైఎస్సార్ ఆశయానికి భంగం వాటిల్లినట్లే! ఎందుకంటే ఆ భూమి వైఎస్ హయాంలో సేకరించింది.. మధ్య తరగతి వారి కోసం సేకరించిన భూమి.. కానీ ఇప్పుడు అమ్మకాల పేరిట ప్రభుత్వమే తప్పిదాలు చేసేందుకు సిద్ధం అవుతోందన్నది ఓ విమర్శ. ఆ వివరం ఈ కథనంలో!
ఆదాయాలను వెతుక్కునే క్రమంలో వైసీపీ కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటోంది. అయినప్పటికీ అప్పుల బెడద అయితే తప్పడం లేదు. ఆదాయాలను వెతుక్కునే క్రమంలో కొత్త కొత్త పరిష్కారాలు ఎంచుకుంటోంది. ఆ విధంగా చేసినా కూడా కొంత మేరకే ఉపశమనం లభిస్తుంది తప్ప పూర్తి స్థాయిలో లేదు.ఆదాయం ఉన్నా లేకపోయినా అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేశారు అన్న అపవాదు మూటగట్టుకున్నాక కూడా వైసీపీ మారడం లేదు. అంతేకాదు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగులు వేస్తోంది.అంటే ప్రభుత్వమే భూములను దగ్గరుండి అమ్ముకుని ఆదాయాలను పెంచుకోవాలని ప్లాన్ చేస్తుంది అన్న మాట.ఇందుకు మొన్నటి వరకూ సీఆర్డీఏ పరిధిలో భూములు ఎంచుకోగా,తాజాగా విశాఖ జాగాలను అమ్ముకునేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది.
విశాఖ జిల్లా, ఎండాడ సమీపంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కోసం, ఇంకా ఇతర ప్రభుత్వ సంబంధ నిర్మాణాల కోసం సేకరించిన 57.53 ఎకరాల స్థలాన్ని అమ్ముకునేందుకు సిద్ధం అవుతోంది. వైఎస్సార్ హయాంలో సేకరించిన భూమిలో అప్పట్లో మధ్య తరగతి జీవులకు అపార్ట్మెంట్లు (డబుల్ ఆర్ ట్రిపుల్ బెడ్ రూమ్ హౌసెస్) కట్టి ఇచ్చేందుకు అప్పట్లో ఓ ప్లాన్ అనుకున్నారు. ఇందుకు అనుగుణంగానే కొందరు ఆసక్తి గల నగర వాసుల నుంచి డబ్బులు కూడా వసూలు చేశారు.
ఎందుకనో ఆ ప్లాన్ ఆగిపోయింది. కానీ ఇప్పుడు కదలిక వచ్చింది. దీంతో ఎకరా భూమిని 21 కోట్ల 75 లక్షలకు అమ్ముకునేందుకు చూస్తున్నారు.తద్వారా 1200 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించాలని చూస్తున్నారు అని ప్రధాన మీడియా చెబుతోంది.ఏం చేసినా కానీ సామాన్యుల నుంచి కానీ ఇతర ఔత్సాహికుల నుంచి కానీ ఇంత మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉన్నా రాజకీయ నాయకులు వీటిని సొంతం చేసుకోవాలన్న ఆతృతలో ఉన్నారని కూడా ప్రధాన మీడియా ఆరోపిస్తుంది. అదే గనుక జరిగితే రెండు వేల కోట్ల రూపాయల భూమి మధ్య తరగతి జీవులకు చెందక బడా బాబుల ఖాతాలో పడిపోవడం ఖాయమని నిర్థారిస్తోంది కూడా!