తెలుగు ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఉగాది కూడా ఒకటి. వసంత రుతువు వచ్చిందని తెలియజేసే పండుగ అది. ఆ సమయంలో ఎటు చూసినా పచ్చని ప్రకృతి మనకు దర్శనమిస్తుంది. కోయిలలు కుహు కుహు రాగాలతో వీనుల విందు చేస్తుంటాయి. అయితే నిజానికి ఉగాది పండుగ తెలుగు సంవత్సరాది. కొత్త తెలుగు సంవత్సరం అదే రోజు ప్రారంభమవుతుంది. అలాగే తెలుగు నెలలు ఆరంభం అయ్యేది కూడా ఉగాది పండుగతోనే. అందుకనే దాన్ని మొదట్లో యుగాది అని పిలిచేవారు. కానీ అది క్రమేణా ఉగాది అయ్యింది.
అయితే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజునే ఉగాది అని పిలుస్తారు. చైత్ర శుద్ధ పాడ్యమి కావడంతో ఆ రోజు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభిస్తాడు. దీంతో అదే రోజును యుగానికి ఆరంభం అని.. యుగాది అని.. ఉగాది అని పిలుస్తూ వస్తున్నారు. ఇక ఆ రోజున తెలుగు ప్రజలు తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటారు. ఇంటి గుమ్మాలను మామిడి ఆకులతో అలంకరిస్తారు. షడ్రుచుల కలయికతో తయారు చేసిన ఉగాది పచ్చడి తింటారు.
ఇక ఉగాది రోజున ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా కొనసాగుతుందని పెద్దలు చెబుతుంటారు. ఆ రోజున భక్తులు పూజలు చేసి పంచాంగ శ్రవణం చేస్తారు. రాబోయే సంవత్సర కాలం పాటు తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని పండితులను అడిగి జాతకం తెలుసుకుంటారు. అలా ఉగాది పండుగ ముగుస్తుంది. అయితే ప్రస్తుత తరుణంలో అంతా పాశ్చాత్య పద్ధతులను పాటిస్తున్న నేపథ్యంలో తెలుగు ప్రజలందరూ ఉగాది పండుగ జరుపుకోవడమే కాదు, దాని ఆవశ్యకతను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది..!