నోటిపూత సమస్య పెద్దదికాకపోయినా..ఇబ్బంది మాత్రం ఎక్కువగా ఉంటుంది. దీనికి మూల కారణం..శరీరంలో వేడి ఎక్కువ, అధిక ఒత్తిడి, డీహైడ్రేషన్ గా చెప్పుకోవచ్చు. దీని నుంచి ఉపశమనం పొందడానకి వెంటనే ఓ టాబ్లెట్ వేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఇంటిచిట్కాల ద్వారా కూడా సమస్యను నాచురల్ గా తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
అసలు నోటిపూత రావడానికి నిపుణులు చెప్పే కారణాలు ఇవే..
అధిక ఒత్తిడి
అప్పుడప్పుడూ మనం తీసుకునే ఆహారం శరీరానికి పడకపోవడం వల్ల
హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా నోటిపూత వచ్చే అవకాశం ఉంటుంది.
జింక్, ఫోలికామ్లం, బి12, సి విటమిన్లు, ఐరన్.. మొదలైనవి లోపించడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చట
నోరు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
నిమ్మ, నారింజ, యాపిల్, టొమాటో, స్ట్రాబెర్రీ.. లాంటి నిమ్మజాతి, ఆమ్ల గుణాలు కలిగిన పండ్లు, కూరగాయలు మోతాదుకు మించి తినడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉందట.
తేనెతో ఉపశమనం..
కొన్నిసార్లు.. నోట్లో కణజాలాలు చిట్లిపోవడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ తిరిగి కణజాలం ఏర్పడడంలో తేనె సహాయపడుతుంది. అలాగే తేనె సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాల వల్ల నోటిపూత నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. దీనికోసం తేనెలో కాస్త పసుపు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను సమస్య ఉన్న భాగంలో రాయాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. తేనె, పసుపు మిశ్రమానికి బదులుగా కేవలం తేనెను కూడా రాసుకోవచ్చు.
కొబ్బరి ..
కొబ్బరినీళ్లు, ఎండు లేదా పచ్చి కొబ్బరి, కొబ్బరి నూనె.. వీటితో కూడా నోటిపూత దూరమవుతుంది. దీనివల్ల శరీరంలోని వేడి తగ్గి ఫలితంగా సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. కొబ్బరి నూనెను సమస్య ఉన్న చోట రాయడం, ఎండు లేదా పచ్చి కొబ్బరి నమలడం.. వంటి వాటి వల్ల కూడా సమస్య త్వరగా తగ్గుతుంది.
తులసి ఆకులు
నోటిలో కొన్ని నీళ్లు పోసుకుని తర్వాత కొన్ని తులసి ఆకుల్ని వేసుకుని.. నీటితో పాటే నమలాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేయటం వల్ల.. దీనివల్ల నోటిపూత త్వరగా తగ్గుతుంది. అలాగే ఈ సమస్య పునరావృతంకాదు.
నొప్పినుంచి ఉపశమనం పొందాలంటే..
నోటి పూత వల్ల వచ్చే నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే.. చిన్న ఐస్ ముక్కను తీసుకుని దాంతో గాయం ఉన్న ప్రదేశంలో నెమ్మదిగా రుద్దడం, బాగా చల్లటి నీటితో నోరు శుభ్రపరచుకోవడం.. లాంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
లవంగం నమలడం, లవంగం నూనె సమస్య ఉన్న ప్రాంతంలో పూయడం.. వల్ల కూడా సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు.
ఈ చిట్కాల ద్వారా సమస్య దాదాపు పరిష్కారం అవుతుంది. కానీ ఎక్కువ రోజులు సమస్య ఉంటే..వైద్యులను సమంప్రదించటం ఉత్తమం.
-Triveni Buskarwothu