కరోనా మహమ్మారి జనాలను కలవరపెడుతోంది. బయటకు వెళ్లినప్పుడు దేన్ని ముట్టుకోవాలన్నా.. ఆఖరికి నగదును టచ్ చేయాలన్నా.. అందరికీ భయం కలుగుతోంది. ఇక ఏటీఎంలలో డబ్బులు తీద్దామంటే.. కరోనా అంటుకుంటుందేమోనని భయం.. అయితే ఈ భయానికి తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు చెక్ పెట్టాయి. ఎలాగంటే…
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, తమిళనాడులలోని చెన్నైలలో ఇకపై ఏటీఎంలను పూర్తిగా శానిటైజ్ చేయనున్నారు. కస్టమర్ వచ్చి ఏటీఎంను వాడుకుని వెళ్లగానే.. ఏటీఎం స్క్రీన్, కీప్యాడ్‌లను శానిటైజ్ చేస్తారు. ఇక నిత్యం 2 సార్లు ఏటీఎంలను పూర్తిగా శానిటైజ్ చేస్తారు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పూర్తి స్థాయిలో అడ్డుకోవచ్చు.
ఇక ప్రస్తుతానికి కేవలం ఆయా నగరాల్లోనే ఏటీఎంల శానిటైజేషన్ ఆరంభమైనా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని అన్ని ఏటీఎంలలోనూ ఇదే తరహాలో శానిటైజేషన్ ప్రక్రియను చేపట్టనున్నాయని తెలిపాయి. ఈ క్రమంలో బ్యాంకులు తమ తమ ఏటీఎం సెంటర్లను ఈ నిబంధనలకు అనుగుణంగా శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ ఏటీఎంను సీజ్ చేస్తారు.