రాజకీయాలు ఎక్కడైనా చేయొచ్చు.. అనేది వైసీపీకి తెలిసినంతగా మరో పార్టీకి తెలియదు. అయితే.. అన్ని విషయాల్లోనూ రాజకీయాలు చేయడాన్ని ప్రజాస్వామ్య వాదులు, పరిశీలకులు కూడా సహించలేక పోతున్నారు. మరీ ముఖ్యంగా ప్రత్యర్థులపై కత్తి దూయడం అనేది వైసీపీ హయాంలో ఎక్కువగానే ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు ఇలా.. అనే మందిని వైసీపీ టార్గెట్ చేసుకుంటూనే ఉంది. అయితే.. ఈ కోవలోనే.. జగన్ సర్కారు టార్గెట్ చేసిందని అనలేక పోయినా.. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వారిపై మాత్రం వివక్ష చూపిస్తోంది.
దీంతో ఇప్పుడు .. వాళ్ల ఉసురుపోసుకోకు జగన్.. అనే కామెంట్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. 2018-19 కాలంలో అప్పటి చంద్రబాబు.. ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రచార కార్యక్రమాల కోసం.. కళాకారులను వినియోగిం చుకుంది. అన్ని జిల్లాల్లోనూ దాదాపు 2 వేల మంది కళాకారులు చంద్రబాబు పథకాలపై తీవ్రస్థాయిలో ప్రచారం చేశారు. గ్రామద ర్శిని, జన్మభూమి, ఆనందలహరి, ఫ్లెమింగో ఫెస్టివల్, ముఖ్యమంత్రి పర్యటనలు తదితర కార్యక్రమాల్లో ప్రదర్శించిన కళారూపాలకు బిల్లులు చెల్లించకుండానే చంద్రబాబు అధికారం దిగిపోయారు.
దీంతో ఆయా కళాకారులు లబోదిబోమంటున్నారు. తమకు ప్రభుత్వాల తో సంబంధం లేదని.. కళను నమ్ముకుని జీవిస్తున్నామని.. తమకు అన్యాయం చేయొద్దని వేడుకుంటున్నారు. మొత్తంగా చూస్తే.. 5 కోట్ల వరకు వీరికి రాష్ట్ర వ్యాప్తంగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. హరికథ, బుర్రకథ, వీధి నాటకం, తోలుబొమ్మలాట, జానపద గేయాలు, వీధి భాగవతం, డప్పు వాద్యం వంటి ప్రదర్శనలిచ్చిన వందల మంది కళాకారులకు ప్రభుత్వం నుంచి రూ. కోట్లు బకాయిలు రావలసి ఉందని ఆ మేరకు నిధులు విడుదల చేసి కళాకారులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీకి వినతులు వస్తున్నాయి.
అయినా.. దీనిని కూడా చంద్రబాబు హయాంలో చేశారు కనుక,, తాము ఇచ్చేది లేదని ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని అంటున్నారు కళాకారులు. ప్రస్తుతం ఈ విషయం … చర్చనీయాంశంగా మారింది. మరి జగన్ ప్రభుత్వం మనసు కరుగుతుందో లేదో చూడాలి.