కరోనా టీకా తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ నిబంధనలు తప్పనిసరి పాటించాలని వైద్య పరిశోధకులు సూచిస్తున్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ టీకా ఇస్తామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికోసం ఏప్రిల్ 28 నుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పటికే తెలిసిన సమాచారం ప్రకారం కొవిడ్ టీకా తీసుకున్న తర్వాత కూడా కరోనా బారిన పడుతున్నారు. అందుకే టీకా తీసుకున్నాక కూడా సామాజిక దూరం, మాస్కు లే నిదే బయటకు వెళ్లకపోవడం చేయాలని వైద్యులు సూచించారు. ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది.
అయితే వ్యాక్సిన్‌పై కొన్ని విషయాలు మనం పాటించాల్సినవి..
కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి టీకా తీసుకోవచ్చా?
వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద కొవిడ్ వ్యాపించే పరిస్థితి ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు తెలుపుతున్నారు. అందుకే కొవిడ్ సోకినవారు లేదా ఆ లక్షణాలు ఉన్నవారు 14 రోజుల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలుపుతోంది.
కోవిడ్ వచ్చి, తగ్గిన వ్యక్తులు టీకా తీసుకోవాల్సిన అవసరం ఉందా?
గతంలో కరోనా బారిన పడి తగ్గిన వ్యక్తులు కూడా వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకోవాలి. రెండు డోసులు పూర్తిగా తీసుకుంటేనే మీ ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది. కరోనా సోకి తగ్గిన 4–8 వారాల తర్వాత టీకా తీసుకోవాలి.
మొత్తం వ్యాక్సిన్ డోస్ ఎప్పుడు పూర్తయినట్లు?
సీడీసీ ప్రకారం రెండో డోస్ తీసుకున్న 2 వారాల తర్వాత మొత్తం వ్యాక్సిన్ డోస్ తీసున్నట్లు పరిగణిస్తారు.
వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా మాస్కు వాడాలా?
మాస్క్, దో గజ్ కీ దూర్ (సామాజిక దూరం), హ్యాండ్ శానిటైజేషన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అప్పుడే తమతోపాటు తమ చుట్టూ ఉన్నవారిని సైతం రక్షణ పొందే అవకాశం ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 14 రోజుల వరకు ఎలాంటి టీకా ప్రభావం ఉండదు. రెండు వారాల తర్వాత ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది. రెండో డోస్ కూడా కచ్చితంగా తీసుకోవాలి. అప్పుడే పూర్తి స్థాయి రోగనిరోధక శక్తి పొందుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
మొత్తం వ్యాక్సిన్ డోస్ పూర్తయ్యాక ఇతరులతో కాంటాక్ట్ అవ్వొచ్చా?
కేవలం ఇంటి సభ్యులు లేదా ప్రైవేట్ ప్లేస్‌లలో మాస్క్ లేకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ వ్యక్తికి ఏ ఇతర వ్యాధులు లేకుండా పూర్తి ఆరోగ్యవంతమైన వ్యక్తి అయి ఉండాలని సీడీసీ తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు త్వరగా కొవిడ్ బారిన పడే లక్షణాలు ఉన్న వ్యక్తిని మాస్క్ లేకుండా కలవకూడదు.
పని ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
పని ప్రదేవాల్లో కూడా ముందు మాదిరిగానే కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలి.
చిన్న పిల్లల్ని హత్తుకోవచ్చా?
పూర్తి స్థాయి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు ఇంట్లో ఉన్న పిల్లల్ని హత్తుకోవచ్చని ఫార్మకాలజీ, మోలిక్యూలర్ నిపుణుడు నామన్ బంపస్ ‘హోప్కిన్స్మెడిసిన్.ఆర్గ్’ పుస్తకంలో తెలిపారు.
వ్యాక్సిన్ తీసుకున్న రోజుల తర్వాత వైరస్ ప్రమాదం తప్పుతుంది?
అది మీ ఇమ్యూనిటీ లెవల్పై ఆధారపడి ఉంటుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది.
కరోనా వ్యాక్సిన్ ద్వారా కొత్త స్ట్రెయిన్ల నుంచి రక్షణ పొందవచ్చా?
కొత్త రకం మ్యూటెంట్ వైరస్ నుంచి కూడా కొద్ది స్థాయిలో తప్పక ప్రభావం ఉంటుంని ఆరోగ్య శాఖ తెలుపుతోంది. కానీ, మ్యూటెంట్ వేరియంట్లను తగ్గించడానికి ప్రజలు పాటించాల్సిన పద్ధతులను కచ్చితంగా పాటించి వైరస్‌ను ఎదుర్కోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది. ఒక మీటర్ దూరం, దగ్గినపుడు చేతిని అడ్డం పెట్టడం, తరచూ చేతిని శుభ్రపరచడం, మాస్క్ ధరించడం, కిటికీలను మూసి ఉంచడం ఇవి తప్పకుండా చేయాలి.