డ్రగ్స్ కింగ్ పిన్ జాన్ స్టీఫెన్ డిసౌజా అలియాస్ స్టీవ్ ని అరెస్టు చేశామన్నారు డీసీపీ చక్రవర్తి. ఆగస్టు 16న బాబు అలియాస్ కాళీ అనే వ్యక్తిని అరెస్టు చేశామని.. అతను ఇచ్చిన సమాచారంతో ఇన్వెస్టిగేషన్ చేశామన్నారు. మొత్తం 600 మంది దేశవ్యాప్తంగా స్టీవ్ లిస్టులో ఉన్నట్లు గుర్తించామన్నారు. కాళీ అరెస్టు తరువాత 7 మంది పేర్లు చెప్పాడని.. ఆ సమాచారం తోనే గోవా వెళ్లి ఆపరేషన్ చేసి స్టీవ్ ని అరెస్టు చేసామన్నారు. గోవాలో డ్రగ్స్ కింగ్ పిన్ గా స్టీవ్ డ్రగ్స్ దందా చేస్తున్నాడన్నారు.
హిల్ టాప్ రెస్టారెంట్లో అతడికి డ్రగ్స్ డెన్ ఉందన్నారు. 1983 నుండి అతడు ఆ రెస్టారెంట్ నడిపిస్తున్నాడని.. ప్రతి శుక్రవారం కూడా స్పెషల్ పార్టీలు జరుగుతాయని విచారణలో వెల్లడైందని తెలిపారు. అక్కడికి వచ్చే టూరిస్టులు డ్రగ్స్ సేవించడం, డ్రగ్స్ కొనుగోలు చేస్తుంటారని తెలిపారు. అంతేకాదు 168 మంది హైదరాబాద్ కి చెందిన కస్టమర్లు కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. స్టీవ్ ని ట్రాన్సిట్ వారింటిపై హైదరాబాద్కు తీసుకువచ్చి విచారిస్తున్నామన్నారు డిసిపి చక్రవర్తి. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తామని తెలిపారు.