పెండ్లి పత్రికల్లో మత్తుమందు.. విలువ రూ.5 కోట్లు!

-

కర్ణాటకలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టు రట్టయ్యింది. కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో రూ.5 కోట్ల విలువచేసే 5 కేజీల ఎఫిడ్రిన్‌ పట్టుబడింది. నాలుగు రోజుల క్రితం కూడా రూ.5 కోట్ల విలువైన 5 కేజీల ఎఫిడ్రిన్‌ను పట్టుబడిన ఘటనను మరువకముందే.. మరో 5 కేజీల డ్రగ్స్‌ దొరకడం అధికారులను సైతం షాక్‌కు గురిచేసింది. కేవలం నాలుగురోజుల వ్యవధిలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడటంపై వారు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.

కాగా, ఈ రెండు ఘటనల్లోనూ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌కు ప్రయత్నించింది ఒకే ముఠా అని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, నాలుగు రోజుల క్రితం కుట్టుమిషన్‌ బాబిన్‌ కేసుల్లో డ్రగ్స్‌ తరలించేందుకు ప్రయత్నించి విఫలమైన స్మగ్లర్లు.. ఈ సారి రూటు మార్చారు. పెండ్లి పత్రికల్లో డ్రగ్స్‌ ప్యాకెట్లు పెట్టి ఆస్ట్రేలియాకు తరలించబోయారు. అయితే ఈ సారి కూడా కస్టమ్స్‌ అధికారులు వారి ఆటలు సాగనియ్యలేదు.

కెంపెగౌడ విమానాశ్రయంలోని కస్టమ్స్‌ అధికారులు శుక్రవారం ఓ వ్యక్తి బ్యాగును చెక్‌చేయగా అందులో 43 శుభలేఖలు కనిపించాయి. అయితే ఆ శుభలేఖలు మూమూలుగా కాకుండా ఉబ్బెత్తుగా ఉండటంతో.. ఓపెన్‌ చేసి చూసిన అధికారులకు దిమ్మతిరిగిపోయింది. ఒక్కో శుభలేఖలో రెండు డ్రగ్స్‌ ప్యాకెట్ల చొప్పున.. మొత్తం 86 ప్యాకెట్లు కనిపించాయి. అన్నిట్లో కలిపి 5 కేజీల ఎఫిడ్రిన్‌ పౌడర్‌ నింపి ఉంది. దాని విలువ రూ.5 కోట్లు ఉంటుందన్న అధికారులు.. డ్రగ్స్‌ను సీజ్‌చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news