ప్రపంచాన్ని జయించానని చెప్పే.. తెలంగాణ రాష్ట్ర సారథి.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ప్రస్తుతం జరుగుతున్న దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో బీజేపీని చూసి భయపడుతున్నారా? ఇక్కడ పార్టీ గెలుపు గుర్రం ఎక్కడంపై ఆయన నమ్మకం కోల్పోయారా? లేక.. బీజేపీ పుంజుకుంటుందని అనుకుంటున్నారా? మొత్తం పరిణామాలు.. తాజాగా జరుగుతున్న దూకుడు పరిస్థితిని గమనిస్తే.. ఔననే అంటున్నారు పరిశీ లకులు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి టీఆర్ ఎస్ అభ్యర్తిగా రామలింగారెడ్డి గెలుపు గుర్రం ఎక్కారు. 89 వేల ఓట్లతో ఆయన విజయం సాధించారు.
అదే సమయంలో బీజేపీ అభ్యర్తిగా పోటీ చేసిన రఘునందన్‌రావు.. సాదించిన ఓట్లు 22 వేల పైచిలుకు. అంటే.. ఈ ఇద్దరి మధ్య మూడు రెట్ల ఓట్ల వ్యత్యాసం ఉంది. పైగా ఇప్పుడు టీఆర్ ఎస్ ఉప ఎన్నికల అభ్యర్తిగా రామలింగారెడ్డి సతీమణికే పార్టీ టికెట్ ఇచ్చింది. అంటే.. సెంటిమెంట్ భారీగా వర్కువుట్ అవుతుంది. పైగా తాను ప్రవేశ పెట్టిన పథకాలు, ప్రజలకు చేస్తున్న మేలు చూసి.. ప్రపంచమే నివ్వెర పోతోందని కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. సో.. ఇప్పుడు ఇక్కడ ఆ నివ్వెరపాటు కనిపిస్తుంది! ఇక, గతంలో ఘోరంగా ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కే ఆ పార్టీ మళ్లీ టికెట్ ఇచ్చింది. మరి ఇన్ని సానుకూలతలు కనిపిస్తున్నా. టీఆర్ ఎస్ మాత్రం ఉలికిపాటు పడుతోంది.
దుబ్బాక ఉప ఎన్నికల బాధ్యతను భుజాన వేసుకున్న మంత్రి హరీష్ రావు కూడా గతంలో లేని విధంగా గాడి తప్పుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రబీజేపీ చీఫ్ బండిసంజయ్‌పై నోరు పారేసుకోవడం.. గెలుపు మాకు ఈజీ అని చెప్పడం వంటివి ఆయన గాడి తప్పుతున్న పరిస్థితికి అద్దం పడుతున్నాయని అంటున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి రఘునందన్ బంధువుల ఇళ్లపై దాడులు చేయించడం.. పోలీసులు ఏకంగా బండిసంజయ్‌ను అరెస్టు చేయడం, బీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జీ చేయడం.. వంటివి దుబ్బాకపై టీఆర్ ఎస్ ఎక్కడ గుబులుగా ఉందనే సంకేతాలను పంపుతోంది.
గెలుపుపై ధీమా ఉన్నప్పుడు ఇలా చేయడం ఎందుకు? బీజేపీ నేతల బంధువుల ఇళ్లలో డబ్బులు ఉంచారని పోలీసుల దాడులు.. వంటివి టీఆర్ ఎస్ ఓటు బ్యాంకును పెంచకపోగా.. బీజేపీకి సింపతీని మాత్రం పెంచినట్టు అవుతోందని అంటున్నారు. గెలుపుపై ధీమా ఉన్నప్పుడు ఇలాంటి చర్యలవల్ల ఒరిగేది ఏముంటుందనే దానికి టీఆర్ ఎస్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏదేమైనా.. దుబ్బాక ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.